ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు .. ప్రచారంలో బిజీగా మారిన అభ్యర్థులు

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు .. ప్రచారంలో బిజీగా మారిన అభ్యర్థులు

వనపర్తి, వెలుగు: ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలింగ్  కు మరో నాలుగు రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 స్థానాల్లో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా మారాయి. బీఆర్ఎస్  తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, తెలంగాణ ఇచ్చిన తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్  పార్టీ అంటోంది.

అవినీతి, బంధుప్రీతి లేని పాలన అందిస్తామని బీజేపీ, బీఎస్పీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో30న ఎన్నికలు నిర్వహించి, వచ్చే నెల 3న కౌంటింగ్  చేపట్టేందుకు అధికారులు దృష్టి పెట్టారు. వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్  ఆఫీసర్లు అబ్జర్వర్లుగా వచ్చారు. ఇప్పటికే పోలింగ్  కేంద్రాలను గుర్తించి, అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే పోలింగ్  స్టేషన్లకు పంపించే ఈవీఎంలు, పీపీ యూనిట్లను సిద్ధం చేసింది. ఒకటికి రెండుసార్లు రాజకీయ పార్టీల ఏజెంట్లు, అబ్జర్వర్ల సమక్షంలో ఈవీఎంలను ర్యాండమైజేషన్  చేసి వాటికి నెంబర్లను కేటాయించారు. 

5 గంటలకే మాక్​ పోలింగ్..

తెల్లవారుజామున 5 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. వివిధ పార్టీల పోలింగ్  ఏజెంట్ల సమక్షంలో మాక్  పోలింగ్ నిర్వహిస్తారు. అందరూ సంతృప్తి వ్యక్తం చేశాక, ఈవీఎంలను రెడీ చేస్తారు. కంట్రోల్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాడ్ లను సరి చూసుకుని పోలింగ్ ను ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ విషయాన్ని పోటీ చేసే అభ్యర్థులు, వారి ఏజెంట్లకు అధికారులు తెలియజేశారు. ఇక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటుపై దృష్టి పెట్టింది. జిల్లా పోలీసులతో పాటు మొబైల్  సెక్యూరిటీ బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే కేంద్ర బలగాలు జిల్లాకు చేరుకోగా, ఎన్నికల రోజు బందోబస్తు కోసం కర్నాటక నుంచి పోలీసులు రానున్నారు. ఈవీఎంలను రెడీ చేసిన ఆఫీసర్లను వాటిని స్ట్రాంగ్​రూమ్​లలో ఏజెంట్ల సమక్షంలో భద్రపరిచారు. ఈ నెల 29న ఎన్నికల సిబ్బందిని పోలింగ్  స్టేషన్లకు పంపించాల్సి ఉండగా, ఇందుకోసం ఒక్కో బూత్ కు సంబంధించి కిట్ ను రెడీ చేశారు. 

గ్రామాల్లో నిఘా..

ఇతర ప్రాంతాలకు పని కోసం వెళ్లిన వారు, ఇతర ప్రాంతాల్లో స్థిర పడిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇలా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు మిగిలిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు గ్రామాల్లో మకాం వేసి ఓటర్లతో రాత్రి పూట మీటింగ్ లు పెడుతున్నారు. దీంతో అధికారులు గ్రామాల్లోనూ నిఘా పెడుతున్నారు. పోలింగ్ కు ఇబ్బంది కలిగించినా, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించినా తమకు నేరుగా ఫిర్యాదు చేయాలని అబ్జర్వర్లు సూచిస్తున్నారు. ఎలక్షన్స్  ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.