మిల్లర్ల మెడకు సీఎమ్మార్ ఉచ్చు.. బీఆర్ఎస్ హయాంలో భారీగా అక్రమాలు

మిల్లర్ల మెడకు సీఎమ్మార్ ఉచ్చు.. బీఆర్ఎస్  హయాంలో భారీగా అక్రమాలు
  •     డిఫాల్ట్  మిల్లులపై క్రిమినల్ కేసులు
  •     ఈ నెల 30లోగా బియ్యం ఇవ్వని మిల్లర్ల ఆస్తుల జప్తునకు ఏర్పాట్లు

వనపర్తి, వెలుగు: సీఎంఆర్​ ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న మిల్లర్లపై కఠినంగా వ్యవహరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. వనపర్తి జిల్లాలో బియ్యం తిరిగి ఇవ్వకుండా వడ్లను రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించారు. 2021–22, 2022–2023లో ప్రభుత్వం జిల్లాలోని 146 రైస్  మిల్లులకు వడ్లు కేటాయించింది.

ఈ వడ్లను సగం మంది మిల్లర్లు గత ప్రభుత్వంలోని పెద్దల అండతో పక్క రాష్ట్రాల్లో అమ్ముకుని క్యాష్  చేసుకున్నారు.ఎఫ్ సీఐతో పాటు స్టేట్  సివిల్  సప్లై  కార్పోరేషన్ కు సకాలంలో బియ్యం తిరిగి అప్పగించకుండా ఆలస్యం చేస్తుండడంతో ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు.

మిల్లర్ల అక్రమాలపై ఎఫ్ సీఐ, సివిల్​ సప్లై ఆఫీసర్లు దృష్టి పెట్టారు. మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని వెంటనే ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సివిల్ సప్లై అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సీఎమ్మార్  ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2022 డిసెంబర్  నాటికే లక్ష మెట్రిక్  టన్నుల బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై అధికారులతో రివ్యూ చేశారు. జిల్లా నుంచి లక్ష మెట్రిక్  టన్నుల బియ్యం ఎఫ్ సీఐకి ఇవ్వకపోవడంతో, ప్రభుత్వానికి ఎఫ్ సీఐ నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోయాయని మిల్లర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

రీసైక్లింగ్  ఆరోపణలపై ఆరుగురు మిల్లర్లపై కేసులు..

రేషన్  బియ్యాన్ని రీసైక్లింగ్  చేస్తున్నారనే ఆరోపణలపై ఆరు మిల్లులపై సివిల్  సప్లై ఆఫీసర్లు కేసులు నమోదు చేశారు. మరో 25 రైస్  మిల్లుల ఓనర్లు బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో వారిపై చర్యలు తీసుకొనేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. వీరు అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఆస్తులను జప్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిల్లర్లకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయనే విషయంపై రెవెన్యూ ఆఫీసర్లు ఆరా తీశారు. వీటి వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించారు. ఇక ఈ నెల 30 వరకు చివరి అవకాశం ఇస్తున్నట్లు ఇటీవల కలెక్టర్  తెలియజేయడంతో, ఇప్పటికిప్పుడు లేని వడ్లను ఎక్కడి నుంచి తేవాలని మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. 

గ్యారంటీ లేకుండానే..

బీఆర్ఎస్  ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ. కోట్ల విలువ చేసే వడ్లను మిల్లర్లకు అప్పగించింది. పక్క రాష్ట్రాల్లో మాత్రం బియ్యం విలువలో సగం డబ్బులు డిపాజిట్  చేసిన మిల్లర్లకే వడ్లను కేటాయిస్తారు. రాష్ట్రంలో ఈ విధానం లేకపోవడంతో మిల్లర్లు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. దీంతో పాటు రాజకీయ నాయకుల అండతో ఏండ్లుగా సీఎమ్మార్​ పెట్టకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 

30 లోగా సీఎమ్మార్​ ఇవ్వాల్సిందే..

సీఎమ్మార్  విషయంలో ప్రభుత్వం ఇటీవల కలెక్టర్లు, సివిల్  సప్లై ఆఫీసర్లతో సమావేశం నిర్వహించింది. ఈ నెల 30 వరకు బియ్యం ఇవ్వాలని గడువు విధించారు. అప్పటికీ బియ్యం ఇవ్వకుంటే మిల్లర్ల ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే డిఫాల్ట్  మిల్లర్ల ఆస్తుల వివరాలు సేకరించాం.
– కొండల్ రావు, సివిల్  సప్లై ఆఫీసర్