ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. చట్టం తన పని తాను చేయాల్సిందే, నిబంధనలు పాటించనివారికి శిక్షలు పడాల్సిందే. కానీ, చలాన్ల రూపంలో జరిమానాను నేరుగా వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల నుంచి 'ఆటో -డెబిట్' చేయాలనే ఆలోచన మాత్రం సరైనది కాదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏ పరిస్థితుల్లో ఈ ప్రకటన చేశారో తెలియదు. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ప్రజల్లో ఇప్పటికే ప్రతికూలత మొదలైంది. ఇది భవిష్యత్తులో ప్రభుత్వ ప్రతిష్టను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. ఈ అప్రజాస్వామిక నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు, కేబినెట్ మంత్రులు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించరు. దీనికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి.
ఇది చట్టబద్ధత లోపంగా పరిగణించాలి. దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా ప్రజల వ్యక్తిగత ఖాతాల్లోకి నేరుగా ప్రవేశించే సాహసం చేయలేదు. చట్టపరంగా ఇలాంటి విధానాలకు ఎక్కడా ఆస్కారం లేదు. న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ఖాతాల్లో ఎక్కువగా ఈఎంఐల కోసం నగదు నిల్వను మెయిన్టెయెన్ చేస్తుంటారు. ప్రభుత్వ నిర్ణయం వీరిపై ప్రభావం చూపనుంది. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని చూసినా అది ఉన్నత న్యాయస్థానాల్లో నిలబడదు. ఒక విధంగా ఇది ప్రాథమిక హక్కులను కాల రాయడమే అవుతుంది. డేటా ప్రైవసీకి ఇది విరుద్ధం. ఈ టెక్నాలజీ యుగంలో ఒక వ్యక్తి బ్యాంక్ వివరాలను ప్రభుత్వ ఫైన్ల కోసం అనుసంధానం చేయడం అనేది 'వ్యక్తిగత డేటా ప్రైవసీ చట్టానికి' పూర్తిగా విరుద్ధం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలి. ప్రజలపై ఆర్థికంగా దాడిచేసే ఇలాంటి విధానాలను పక్కనపెట్టి చట్టబద్ధమైన పద్ధతుల్లోనే ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలనికోరుతున్నాను.
- సురేందర్ తాళ్లపల్లి
