రామాయంపేటలో ఆటోడ్రైవర్ల రాస్తారోకో

రామాయంపేటలో ఆటోడ్రైవర్ల రాస్తారోకో

రామాయంపేట, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోతున్నా మని, ఆ పథకాన్ని వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ రామాయంపేటలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.

శనివారం రామాయంపేట ఉమ్మడి మండలంతో పాటు నార్సింగి మండలాల నుంచి సుమారు 400 మంది ఆటో డ్రైవర్లు  పట్టాణానికి తరలివచ్చి భారీ ర్యాలీ తీశారు. అనంతరం  సిద్దిపేట చౌరస్తా లో బైఠాయించి  రాస్తారోకో చేశారు. మహాలక్ష్మి పథకం ఎత్తి వేయాలని, లేదంటే తమకు జీవనోపాధి  కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 

సిద్దిపేట టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్న విషయం ప్రభుత్వం గ్రహించకపోవడం శోచనీయమని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు పాల సాయిరాం ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సిద్దిపేట పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆటోలతో  నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆటో లేని సమాజాన్ని ఊహించలేమని  కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 50లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు.రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల జీవితాలు బాగుపడాలంటే ప్రభుత్వం వారికి నెలకు రూ.15000 చెల్లించాలన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.