నెల్లికుదురు మండలంలో అదుపుతప్పి బావిలో పడిన ఆటో

నెల్లికుదురు మండలంలో అదుపుతప్పి బావిలో పడిన ఆటో
  • భర్త మృతి, భార్య, కొడుకుకు గాయాలు
  • మహబూబాబాద్‌‌ జిల్లా నెల్లికుదురు మండలంలో ఘటన

నెల్లికుదురు, వెలుగు : ఆటో అదుపుతప్పి బావిలో పడడంతో భర్త చనిపోగా, భార్య, కొడుకు గాయపడ్డారు. ఈ ప్రమాదం మహబూబాబాద్‌‌ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై చిర్ర రమేశ్‌‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మునిగలవీడు గ్రామానికి చెందిన శ్రీరాం మార్కండేయ తన సొంత ఆటోలో తల్లిదండ్రులు శ్రీరాం నరసయ్య (75), భారతమ్మతో కలసి ఆదివారం వెంకటాపురంలో బంధువు అంత్యక్రియలకు హాజరయ్యారు.

దహన సంస్కారాలు పూర్తి అయ్యాక రాత్రి తిరిగి ఆటోలో గ్రామానికి వస్తున్నారు. గ్రామ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ పాడుబడిన బావిలో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి బావిలో నుంచి నరసయ్య, భారతమ్మ, మార్కండేయను బయటకు తీశారు. అప్పటికే నరసయ్య చనిపోగా, గాయపడిన భారతమ్మ, మార్కండేయను హాస్పిటల్‌‌కు తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.