తిరుమలలో లడ్డూల తయారీకి ఆటోమేటిక్ యంత్రాలు

తిరుమలలో లడ్డూల తయారీకి ఆటోమేటిక్ యంత్రాలు

శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో లడ్డూ తయారీ కోసం వచ్చే డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అలాగే.. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచేలా తిరుమల మ్యూజియంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శ్రీవారి సన్నిధిలోని ఆనంద నిలయం బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. నిర్ధేశించిన సమయంలో బంగారు తాపడం పనులను పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని.. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో పనులను వాయిదా వేశామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు. 

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా టీటీ దేవ స్థానమ్స్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను ఇటీవల ప్రారంభించినట్లు ఈఓ చెప్పారు.  ఈ యాప్ ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవడంతో పాటు విరాళాలు కూడా అందించవచ్చని చెప్పారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చన్నారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించవచ్చని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతకు ధార్మిక అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో తిరుమల ఆస్థానమండపంలో యువ ధార్మికోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. దాదాపు 2 వేల మంది యువతీ యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఇక తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభం కానుందని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

తిరుమలలో జరిగే కార్యక్రమాలు

1.  ఫిబ్రవరి 5న రామకృష్ణతీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడ సేవ.
2.  ఫిబ్రవరి 18న గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం.
 3. ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో.
4. ఫిబ్రవరి 11 నుండి 20వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో.
 5. ఫిబ్రవరి 19 నుండి 27వ తేదీ వరకు తొండమనాడులోని శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో.
 6. ఫిబ్రవరి 28 నుండి మార్చి 8వ తేదీ వరకు తరిగొండలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు