
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా కొనసాగుతున్న అవసరాల శ్రీనివాస్.. ‘పిండం’ చిత్రంలో కీలకపాత్రను పోషించాడు. సాయికిరణ్ దైదా దర్శకత్వంలో యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 15న విడుదలవుతున్న సందర్భంగా అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ఇందులో అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే లోక్ నాథ్ అనే పాత్రలో కనిపిస్తా.
వాటిలో నిష్ణాతురాలైన ఈశ్వరీ రావు గారి దగ్గరకు రీసెర్చ్ కోసం వెళ్తాను. సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. నిజానికి నేను హారర్ చిత్రాలను అంతగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ‘ప్రేమ కథా చిత్రమ్’ థియేటర్‌లో చూసినప్పుడు, కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారనే విషయం అర్థమైంది.
అలాగని కేవలం భయపెట్టడమే కాకుండా, ఎమోషనల్‌గానూ కనెక్ట్ అయ్యేలా ఉండాలనేది నా అభిప్రాయం. ‘పిండం’ అలాంటి సినిమానే. ఇక నటుడిగా ఈగల్, కిస్మత్, కన్యాశుల్కం చిత్రాల్లో కనిపించబోతున్నా. అలాగే దర్శకుడిగా ఓ మర్డర్ మిస్టరీ స్టోరీ రెడీ చేస్తున్నాను’ అని చెప్పాడు.