సీక్రెట్స్ ఎలా బయటపెడతావ్ కోహ్లీ.. బీసీసీఐ సీరియస్.. ఏం జరిగిందంటే..?

సీక్రెట్స్ ఎలా బయటపెడతావ్ కోహ్లీ.. బీసీసీఐ సీరియస్.. ఏం జరిగిందంటే..?

భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్‌ కోహ్లీపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐ మార్గదర్శకాల ప్రకారం..  గోప్యంగా ఉంచాల్సిన జట్టు సమాచారాన్ని అతను నలుగురిలో బహిరంగపరచటమే అందుకు కారణం. అసలేం జరిగిందంటే..?

ఆసియా కప్‌కు ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్ సీఏ)లో భారత క్రికెటర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్ టెస్టు(యోయో టెస్టు) నిర్వహించింది. ఈ టెస్టులో విరాట్ కోహ్లీకి 17.2 స్కోరు రాగా.. ఆ విషయాన్ని అతను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. తనకు ఫిట్‌నెస్ టెస్టులో 17.2 రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులతో పంచుకున్నాడు. ఇదే బీసీసీఐకి ఆగ్రహాన్ని తెప్పించింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఇలాంటి వివరాల పట్ల ప్రతి ఆటగాడు గోప్యత పాటించాలి. కానీ, కోహ్లీ అవేమి పట్టనట్లు సోషల్ మీడియాలో పెట్టాడు. 

కోహ్లీకి.. బీసీసీఐ వార్నింగ్

కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్‌గా మారిన కొన్ని గంటల్లోనే బీసీసీఐ మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. టీమిండియా ఆటగాళ్లను ఉద్దేశిస్తూ కఠిన మార్గదర్శకాలను రూపొందించింది. జట్టుకు సంబంధించిన ఎలాంటి సమాచారమైన గోప్యాంగా ఉంచాలని.. పబ్లిక్ ప్లాట్‌ఫామ్ లలో పెట్టడం బీసీసీఐ రూల్స్‌ను ఉల్లంఘించడం కిందకు వస్తుందని కోహ్లీని హెచ్చరించింది. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆటగాళ్లు ఎవరూ జట్టు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని కోరింది.

కాగా, ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ.. భారత క్రికెటర్లకు ఆరు రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఇక యోయో టెస్టులో కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా పాసయ్యారు. ఈ టెస్టులో బీసీసీఐ నిర్దేశిత స్కోరు.. 16.5. అంటే.. ఈ స్కోరును అధిగమిస్తేనే పాసైనట్లు లెక్క.