అవేర్​నెస్​తోనే  టీబీ అంతం

అవేర్​నెస్​తోనే  టీబీ అంతం

వైద్యశాస్త్ర చరిత్రలో 1882, మార్చి 24  సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎందుకంటే  కొన్ని వేల సంవత్సరాలుగా మానవుడితో దాగుడుమూతలాడుతూ, మనిషి మనుగడను శాసిస్తూ, అప్పటివరకు అంతుపట్టకుండా ఉన్న ఒక భయంకర వ్యాధికి కారణమైన ‘సూక్ష్మక్రిమి’ని రాబర్ట్‌‌ కోచ్‌‌అనే జర్మన్‌‌ శాస్త్రవేత్త కనుగొన్నారు. రాబర్ట్‌‌కోచ్‌‌ పరిశోధన ఆధునిక యుగ జీవ, వైద్యశాస్త్ర పరిశోధనా రంగంలో ఒక ప్రధాన మైలురాయి అని ప్రముఖ శాస్త్రవేత్త పాల్‌‌ ఎర్లిచ్‌‌ అభివర్ణించారు. ఒక భయంకర వ్యాధి కారక సూక్ష్మ క్రిమిని కనుగొన్నందుకు రాబర్ట్‌‌ కోచ్‌‌కు1905లో వైద్య శాస్త్రంలో నోబెల్‌‌ పురస్కారం లభించింది.

ఆ సూక్ష్మక్రిమి కలుగజేసే వ్యాధి ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరిని బలిగొనేది. ఆ వ్యాధే క్షయ(ట్యూబర్‌‌క్యులోసిస్‌‌–- టీబీ). మైకోబ్యాక్టీరియమ్‌‌ ట్యూబరిక్లోసిస్‌‌ అనే సూక్ష్మ క్రిమి క్షయ వ్యాధిని కలుగచేస్తుంది. రాబర్ట్‌‌ కోచ్‌‌ పరిశోధన ఫలితంగా క్షయ వంశపారంపర్యంగా కాక, ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుందని ప్రయోగాత్మకంగా, శాస్త్రీయంగా నిరూపితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ప్రపంచ టీబీ నివేదిక ప్రకారం సుమారు 10 మిలియన్ల మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక అంటువ్యాధుల్లో టీబీ ఒకటి. చరిత్రలో చాలా మంది ప్రముఖులు- నెల్సన్ మండేలా, కమల నెహ్రూ, జాన్ కీట్స్,  సుభాష్ చంద్ర బోస్ , శ్రీనివాస్ రామానుజన్, మహమ్మద్ అలీ జిన్నా  దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ వరకు టీబీ బాధితుల జాబితాలో ఉన్నారు.

అవగాహనతో అంతం చేయొచ్చు..

డాక్టర్లు సూచించిన మందులను పూర్తి కాలం పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే టీబీ నయమవుతుంది. వ్యాధి ఎన్ని రోజులకు నయం అయ్యేది చికిత్స వ్యవధి, వ్యాధి స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మైక్రోబయోలాజికల్ గా ధ్రువీకరించిన పల్మనరీ టీబీ రోగులు ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేస్తారు. అలాంటి వారు కనీసం రెండు వారాలు యాంటీ టీబీ మందులు తీసుకుంటే, రెండు వారాల తర్వాత వారి నుంచి టీబీ వ్యాప్తి జరగదు. మందుల మొత్తం వ్యవధిని పూర్తి చేయడం ముఖ్యం. ఇతర అవయవాలను(ఊపిరితిత్తులు కాకుండా) ప్రభావితం చేసే టీబీ కేసు అయితే, అది అంటువ్యాధి కాదు.

మాస్క్ ధరించడం వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు. కాబట్టి ఏ వ్యవధిలోనైనా దగ్గు ఉన్న వ్యక్తిని మాస్క్ పెట్టుకోమని ప్రోత్సహించాలి. టీబీ రోగులు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ‘నిక్షయ్ పోషణ్ యోజన’ కింద భారత ప్రభుత్వం టీబీ రోగులకు వారి చికిత్స మొత్తం వ్యవధికి పోషకాహారం కోసం ప్రతి నెలా రూ. 500 అందిస్తున్నది. 2023 ఏడాదికి గాను ‘అవును! మనం టీబీని అంతం చేయగలం’ అనే థీమ్​తో ప్రపంచ వ్యాప్తంగా టీబీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. టీబీ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, వ్యాధి బారిన పడిన వ్యక్తులకు సరైన వైద్యం అందించడం ద్వారా టీబీని అంతం చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, పౌర సమాజం నడుం బిగించాలి.

భయపెడుతున్న గణాంకాలు

టీడీ ప్రధానంగా ఊపిరితిత్తుల‌‌ను ప్రభావితం చేయ‌‌డ‌‌మే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నెముక‌‌, మెద‌‌డు, గ‌‌ర్భాశం వంటి కీల‌‌క అవ‌‌య‌‌వాల‌‌ను సైతం ప్రభావితం చేస్తుంది. ఇలాంటి ప్రమాద‌‌క‌‌ర‌‌మైన మ‌‌హ‌‌మ్మారిపై 2030 నాటికి విజ‌‌యం సాధించాల‌‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డ‌‌బ్ల్యూహెచ్‌‌వో) ల‌‌క్ష్యం పెట్టుకుని ముందుకెళ్తున్నది. ఈ వ్యాధిపై అవ‌‌గాహ‌‌న క‌‌ల్పించేందుకు ఏటా మార్చి 24న వరల్డ్​టీబీ డే నిర్వహిస్తున్నారు.

ఇవాళ క్షయ వ్యాధి దినోత్సవం సంద‌‌ర్భంగా.. అస‌‌లు టీబీ ఎలా వ‌‌స్తుంది? ఇది ఏ అవ‌‌యవాల‌‌పై ప్రభావం చూపిస్తుంది? దీన్ని ఎలా గుర్తించాలి? చికిత్స ప‌‌ద్ధతులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దాదాపు1/4వ వంతు(26%) భారతదేశంలోనే ఉన్నట్లు అంచనా. ఏటా సుమారు 30 లక్షల కొత్త టీబీ కేసులు వెలువడుతున్నాయి. దేశంలో  ఏటా టీబీతో 5 లక్షల మరణాలు, ప్రతి రెండు నిమిషాలకు ఒక టీబీ మరణం సంభవిస్తున్నది. – డా.జి. సురేంద్ర బాబు, ఎండీ, సిరిసిల్ల