బయటపడిన యాక్సిస్ ఫండ్ స్కామ్‌‌

బయటపడిన యాక్సిస్ ఫండ్ స్కామ్‌‌

బ్రోకర్లతో కుమ్మక్కై రూ.కోట్లు సంపాదించిన ఫండ్​ మేనేజర్లు

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు:దేశ సెక్యూరిటీస్ మార్కెట్‌‌లో మరో పెద్ద స్కామ్‌‌ బయటపడింది. రూ. 2.59 లక్షల కోట్లను  మేనేజ్ చేసే యాక్సిస్ మ్యూచువల్‌‌ ఫండ్‌‌ టాప్ మేనేజర్లు ఈ స్కామ్‌‌కు పాల్పడ్డారని సెబీ ఆరోపిస్తోంది. ఫండ్స్‌‌ నుంచి  షేర్లలో ఇన్వెస్ట్ చేసే ముందే,  తమ పర్సనల్ అకౌంట్ల నుంచి ఈ ఫండ్ మేనేజర్లు ఆయా షేర్లలో ఇన్వెస్ట్ చేయడం (ఫ్రంట్ రన్నింగ్‌‌) చేశారని గుర్తించింది.  ఇలా గత రెండేళ్లలోనే తొమ్మిది షేర్లలో ఇన్వెస్ట్ చేసి రూ. 170 కోట్లను సంపాదించారని ఆరోపిస్తోంది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వంటి పెద్ద ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఏదైనా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ఆ షేరు వాల్యూ అమాంతం పెరుగుతుందన్న విషయం తెలిసిందే.    యాక్సిస్​ మ్యూచువల్​ ఫండ్​లోని ఇద్దరు సీనియర్​ ఫండ్​ మేనేజర్లు (వీరేష్​ జోషి, దీపక్​ అగర్వాల్​లు)  ఫ్రంట్​ రన్నింగ్​ యాక్టివిటీస్‌‌కు పాల్పడ్డారనే అంశంపై సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ ఫండ్ మేనేజర్ల  కింద 2017–2021 మధ్యలో యాక్సిస్ మ్యూచువల్‌‌ ఫండ్​జరిపిన లావాదేవీలపై సెబీ  దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.  ఏవైనా షేర్లలో అమ్మకాలు లేదా కొనుగోళ్లు జరిపే ముందుగానే బ్రోకర్లకు ఆ ఇన్ఫర్మేషన్​ ఇవ్వడం లేదా ఫండ్​ మేనేజర్లే  సొంతంగా ఆ షేర్లను కొనడం, అమ్మడం చేయడాన్ని ఫ్రంట్​రన్నింగ్ అంటారు. ఇలా ఫ్రంట్​ రన్నింగ్​ కార్యకలాపాలకు పాల్పడటం మ్యూచువల్​ ఫండ్​ రూల్స్​కే కాకుండా, మన దేశంలోని చట్టాలకు విరుద్ధం.  చాలా బ్లూచిప్​ కంపెనీల షేర్లను ఈ ఫండ్​ కొనుగోలు చేసింది. దివీస్​, కోఫోర్జ్​, నౌకరి వంటి షేర్లలో పెట్టుబడులు పెట్టింది. తాజాగా ఈ షేర్ల ధరలన్నీ పతనమవుతున్నాయి. మ్యూచువల్​ ఫండ్స్​  రూ. కోట్లల్లో ట్రాన్సాక్షన్లు జరుపుతాయి. దీంతో షేర్ల కదలికలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. 

దర్యాప్తు జరుపుతున్నాం: యాక్సిస్‌‌ 

 తమ  ఫండ్​ మేనేజర్లు ఇద్దరు ఫ్రంట్​ రన్నింగ్​ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అనుమానించిన యాక్సిస్​ మ్యూచువల్​ ఫండ్​ గత రెండు నెలలుగా వారిపై అంతర్గత విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం. తప్పు చేసినట్లు తేలడంతో ఆ ఇద్దరు ఫండ్​ మేనేజర్లనీ ఉద్యోగాల నుంచి యాక్సిస్​ మ్యూచువల్​ ఫండ్ తొలగించింది.  యాక్సిస్​ బ్యాంకు బోర్డుకు కూడా ఈ విషయాన్ని తెలియచేసింది. మీడియాకు ఈ సమాచారం అందడంతో ఇండిపెండెంట్‌‌ ఆడిటర్ల సాయంతో దర్యాప్తు చేస్తున్నామని, రూమర్లను నమ్మవద్దని కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎలాంటి అక్రమాలనూ తాము సహించబోమని స్పష్టం చేసింది. కాకపోతే,  గత రెండు నెలలుగా దర్యాప్తు కొనసాగుతుంటే, ఆ అంశాన్ని బయటకు చెప్పకుండా, యాక్సిస్​ మ్యూచువల్​ ఫండ్​ దానిని దాచిపెట్టడంలో ఔచిత్యం ఏమిటని ఇన్వెస్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఫ్రంట్​ రన్నింగ్​ యాక్టివిటీస్​ను సెబీ సీరియస్​ నేరంగానే పరిగణిస్తుంది. యాక్సిస్​ బ్యాంకు మ్యూచువల్​ ఫండ్​ చేతిలో మొత్తం 7  స్కీములున్నాయి. ఫ్రంట్​ రన్నింగ్​ ఆరోపణలు రావడంతో ఈ స్కీమ్స్ నుంచి ఇన్వెస్టర్లు తమ డబ్బులను బయటకు తీసుకుంటున్నారని సమాచారం. డీమార్ట్​, దివీస్​ ల్యాబ్​, కోఫోర్జ్, టోరెంట్​ పవర్, నౌకరి, ఎస్​జేఎస్​ ఎంటర్​ప్రైజస్​, విజయా డయాగ్నస్టిక్స్​, సీసీఎల్​ ప్రొడక్ట్స్​, గో ఫ్యాషన్స్​, అహ్లువాలియా కాంట్రాక్ట్స్​వంటి షేర్లలో ఈ ఫండ్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఈ షేర్లన్నీ శుక్రవారం 5 % మేర పడ్డాయి. ఫండ్​ మేనేజర్లపై దర్యాప్తు సమాచారం అందడంతో చాలా మంది బడా ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్ముకుని బయటపడుతున్నట్లు తెలుస్తోంది.  ముందస్తు సమాచారం లేని సగటు ఇన్వెస్టర్లు మాత్రం ఈ కంపెనీల షేర్లలో ఇరుక్కుపోయారు.