సీఎం యోగి కీలక నిర్ణయం.. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు

సీఎం యోగి కీలక నిర్ణయం.. జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు

ఆయోధ్య  రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా 2024 జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అన్ని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులను మూసివేయనున్నట్లుగా తెలిపారు.   ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.  ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా ప్రాణ-ప్రతిష్ఠ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను  సీఎం ఆదిత్యనాథ్‌ పరిశీలించారు.  ఉత్తరప్రదేశ్ లాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జనవరి 22వ తేదీన సెలువు ప్రకటించాలని రామ భక్తులు కోరుతున్నారు.   

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు.

అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్​లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలను లైవ్​లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. వేడుకలు జరిగే రోజున అయోధ్యకు అందరూ వచ్చే అవకాశంలేనందున ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలను వీక్షిస్తూ, బాల రాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది.