అయోధ్యకు ఇప్పుడే రావొద్దు : దర్శనం టైమింగ్స్ పొడిగింపు

అయోధ్యకు ఇప్పుడే రావొద్దు : దర్శనం టైమింగ్స్ పొడిగింపు

అయోధ్య భక్తులతో నిండిపోయింది. నగరం అంతా కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే. జన సంద్రంగా మారిన అయోధ్యలో.. బాల రాముడి దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతకంతకూ పెరుగుతున్న భక్తుల రద్దీతో.. అయోధ్య ట్రస్ట్ జనవరి 24వ తేదీ కీలక ప్రకటన చేసింది. అయోధ్యకు ఇప్పుడు ఎవరూ రావొద్దు.. 15 రోజుల తర్వాతే రండి.. అప్పటి వరకు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రామ భక్తులకు సూచించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అందరూ ఒకేసారి రావటం వల్ల.. సౌకర్యాలు కల్పించటం, దర్శనం కల్పించటం కష్టంగా మారిందని వెల్లడించింది. 15 రోజులు అయితే రద్దీ తగ్గుతుందని.. దర్శనం సులభతరం అవుతుందని సూచించింది అయోధ్య ట్రస్ట్.

అయోధ్యలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాములోరి దర్శనం సమయాలను పొడిగించింది. రాత్రి 10 గంటల వరకు ఆలయం ఓపెన్ చేసి ఉంచుతున్నారు. ముందుగా ప్రకటించిన సమయం ప్రకారం రాత్రి 7 గంటలకే ఆలయం మూసివేయాల్సి ఉంటుంది. భక్తుల రద్దీతో రాత్రి 10 గంటల వరకు.. అంటే మూడు గంటలు అదనంగా సమయాన్ని పొడిగించినట్లు వెల్లడించారు అధికారులు. అయినా భక్తుల రద్దీ తగ్గటం లేదని.. ఇంకా వేలాది మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉంటున్నారని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరో 15 రోజుల వరకు ఎవరూ అయోధ్య రావొద్దని పిలుపునిచ్చింది. ఇప్పటికే ప్రయాణాలు షెడ్యూల్ చేసుకున్న వారు రావొచ్చని.. కొత్తగా ప్రయాణ షెడ్యూల్ చేసుకునే వారు మాత్రం ఆగిపోవాలని సూచించింది.

అయోధ్యలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. అయోధ్య నగరంలో 8 వేల మంది పోలీస్, ప్రైవేట్ సెక్యూరిటీ, పారిశుధ్య సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్లు వివరించింది అయోధ్య ట్రస్ట్.