
గోదావరిఖని, వెలుగు: కేసీఆర్పాలనలో సింగరేణిలో ఒక్క సింగరేణి గనులు ఏర్పాటు చేయలేదని, 2018లో శ్రీరాంపూర్ బహిరంగసభలో సింగరేణిలో 10 కొత్త గనులను తవ్వి ఉద్యోగాలను కల్పిస్తామని ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్ ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం గోదావరిఖని దుర్గానగర్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీల్లో కార్మికుల మారు పేర్ల ఇష్యూ ఇంకా పరిష్కారం కాలేదని, కోల్‌బెల్ట్‌లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంగతే మరిచిపోయారన్నారు.
సింగరేణిలో 49 శాతంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వాటాను గతంలో కాంగ్రెస్ అమ్మడానికి ప్రయత్నించిందని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి ఆస్తులను ఇష్టమున్నట్టుగా వాడుకుంటూ.. సంస్థను నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీటింగ్‌లో యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.నర్సింహరెడ్డి, పి.ధర్మపురి, శంకర్ నాయక్, సూర సమ్మయ్య, కె.సదానందం, తదితరులు పాల్గొన్నారు.