
జాదవ్‌పూర్ వర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై దాడి
ఆరు గంటల పాటు టెన్షన్.. ఆ తర్వాత వచ్చి మంత్రిని తీసుకెళ్లిన బెంగాల్ గవర్నర్ ధన్కర్
కోల్‌కతా:బెంగాల్‌లోని జాదవ్‌పూర్ వర్సిటీ గురువారం రణరంగంలా మారింది. స్టూడెంట్ యూనియన్ల మధ్య కొట్లాట కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోపై దాడికి దారితీసింది. గంటల పాటు వర్సిటీ లోపల చిక్కుకుపోయిన మంత్రిని చివరికి గవర్నర్ వచ్చి కాపాడారు. ఈ సంఘటనతో బెంగాల్లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..
జేయూలో ఏబీవీపీ గురువారం మధ్యాహ్నం ఓ సెమినార్ నిర్వహించింది. దీనికి సుప్రియో గెస్ట్‌గా వచ్చారు. బీజేపీ ఎంపీ రాకను నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలకు చెందిన ఎస్ఎఫ్ఐ, ఐఐఎఫ్‌ఎస్, ఎఫ్‌ఈటీఎస్‌యూ, ఐఏఎస్ఏ తదితర యూనియన్లు నిరసనలు చేపట్టాయి. నల్లజెండాలు ఊపుతూ మంత్రి కారును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. బాబుల్ వెనక్కి వెళ్లిపోవాలని లెఫ్ట్ వింగ్ స్టూడెంట్లు నినాదాలు చేశారు. వీటిని లెక్కచేయకుండా మంత్రి లోనికెళ్లి, సెమినార్లో మాట్లాడిన తర్వాత తిరిగి వెళుతుండగా మరోసారి లెఫ్ట్‌వింగ్ స్టూడెంట్స్ ఆయన్ని అడ్డుకున్నారు. మంత్రిని చుట్టుముట్టిన స్టూడెంట్స్ ఒక దశలో ఆయనపై దాడికి దిగారు. సెక్యూరిటీ, పోలీసుల్ని కిందపడేసి, మంత్రి జుట్టు పట్టుకుని, చెంపలపై కొడుతూ, చొక్కా చించేశారు. వీసీ సురంజన్ దాస్ సర్దిచెప్పినా స్టూడెంట్స్ వినిపించుకోలేదు. దాదాపు రెండు గంటలపాటు మంత్రిని నిర్బంధించారు.
కాపాడిన గవర్నర్
మంత్రిని ఘెరావ్ చేశారన్న విషయం తెలియగానే బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ రంగంలోకిదిగారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆయన, పోలీస్ ఫోర్స్‌ను వెంటేసుకుని వర్సిటీకి బయలుదేరారు. గవర్నర్‌ను కూడా లోనికి రానియ్యకుండా స్టూడెంట్స్ అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో మంత్రిని కాపాడిన గవర్నర్.. రాత్రి 8.30 గంటలకు తన కారులోనే ఆయనను బయటికి తీసుకొచ్చారు. బీజేపీ మంత్రిని లెఫ్ట్‌వింగ్ అడ్డుకోడాన్ని నిరసిస్తూ ఏబీవీపీకి చెందిన స్టూడెంట్లు వర్సిటీలో విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల రూమ్‌లలో ఫ్యాన్లు, టేబుళ్లను ధ్వంసం చేసి, క్యాంపస్‌లో పలుచోట్ల టైర్లను తగులబెట్టారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫొటోలు, వీడియోల ఆధారంగా మంత్రిపై దాడికి పాల్పడ్డవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదంపై టీఎంసీ నేతలెవరూ స్పందించలేదు.
నక్సలైట్లమని చెప్పుకున్నారు
మమతా బెనర్జీ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడితప్పింది. నాపై దాడి ఘటనే అందుకు నిదర్శనం. నాతో వాగ్వాదానికి దిగిన స్టూడెంట్స్ తమను తాము నక్సలైట్లుగా చెప్పుకున్నారు. పదేపదే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సెమినార్లో మాట్లాడటానికే జేయూకి వెళ్లాను తప్ప రాజకీయాలు చేయడానికి కాదు.
– మంత్రి బాబుల్ సుప్రియో