భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నార్మల్ డెలివరీ సమయంలో శిశువు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నార్మల్  డెలివరీ సమయంలో శిశువు మృతి
  •     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

చండ్రుగొండ, వెలుగు : వైద్య సిబ్బంది ఓ మహిళకు నార్మల్  డెలివరీ చేస్తున్న సమయంలో శిశువు చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పీహెచ్ సీలో గురువారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. జిల్లాలోని తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఫర్జానా నిండు గర్భిణి.  ఆమె భర్త కరీం ఆమెను డెలివరీ కోసం చండ్రుగొండ పీహెచ్ సీకి బుధవారం రాత్రి తీసుకువచ్చాడు. ఫర్జానాకు డాక్టర్లు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. తల్లీశిశువు ఆరోగ్యంగా ఉన్నారని, నార్మల్  డెలివరీ అవుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. గురువారం నార్మల్  డెలివరీ చేస్తుండగా శిశువు తల భాగం బయటకు వచ్చి ఆగిపోయింది.

శిశువుని చాలా జాగ్రత్తగా బయటకు తీశారు. శిశువులో ఎలాంటి కదలికలు లేకపోవడంతో  మెడికల్  ఆఫీసర్  తనూజ.. తల్లీబిడ్డను రామవరంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే శిశువు చనిపోయిందని తెలిపారు. శిశువు మృతి కి వైద్య సిబ్బందే కారణమని బాధిత కుటుంబ సభ్యులు చండ్రుగొండ పీహెచ్ సీ ముందు కాసేపు ఆందోళన చేశారు. వైద్యులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ విషయమై మెడికల్ ఆఫీసర్  తనూజ ను వివరణ కోరగా డెలివరీ సమయంలో శిశువు మలం తాగిందని, అందుకే మృతి చెందిందని చెప్పారు.