‘యాజ్ దే గ్రో’.. బేబీ ప్రొడక్ట్స్‌‌ను రీసేల్ చేసుకోవచ్చు

‘యాజ్ దే గ్రో’.. బేబీ ప్రొడక్ట్స్‌‌ను రీసేల్ చేసుకోవచ్చు

ఇంట్లో పసిపిల్లలు ఉంటే వాళ్ల కోసం చాలా వస్తువులు కొనాల్సి వస్తుంది. నిద్ర పుచ్చడానికి ఉయ్యాల, నడక నేర్పేందుకు వాకర్, బయటకు తీసుకెళ్లేందుకు స్ట్రోలర్.. ఇలా బ్యాగ్ నుంచి బొమ్మల వరకూ పిల్లల కోసం రకరకాల బేబీ ప్రొడక్ట్స్ కొనాలి. అయితే పిల్లలు పెద్దయ్యాక వాటితో పెద్దగా పని ఉండదు. దాంతో అవన్నీ ఇంట్లో వృథాగా ఉండిపోతాయి. చాలా ఇళ్లల్లో కనిపించే ప్రాబ్లమ్ ఇది. అందుకే దీనికో సొల్యూషన్ కనిపెట్టారు హైదరాబాద్‌‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. ‘యాజ్ దే గ్రో’ పేరుతో ఇన్‌‌స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేసి, బేబీ ప్రొడక్ట్స్‌‌ను రీసేల్ చేసుకునే వీలు కల్పిస్తున్నారు.

హైదరాబాద్‌‌కు చెందిన అంకిత, రీతూలు అక్కాచెల్లెళ్లు. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన వీళ్లిద్దరికీ తల్లుల ఇబ్బందులు తెలుసు. అంకిత తన పిల్లల కోసం ఎన్నోరకాల బేబీ ప్రొడక్ట్స్ కొన్నది. పిల్లలు పెద్దయ్యాక అవన్నీ ఇంట్లో వృథాగా పడి ఉండడం చూసింది. వాళ్లది ఉమ్మడి కుటుంబం అవ్వడంతో ఫ్యామిలీలో ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్లకు బట్టలు, బొమ్మలు, స్ట్రోలర్స్, బేబీ కాట్స్ లాంటివి ఇచ్చేది. అయినా ఇంట్లో చాలా వస్తువులు మిగిలిపోయేవి. అప్పుడే తనకొక విషయం అర్థమైంది తనలాగే దేశంలో ఎంతోమంది తల్లులు బేబీ ప్రొడక్ట్స్‌‌ను వృథాగా పడేస్తున్నారని.  వాటివల్ల ఎంతో ఖర్చు వేస్ట్ అవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా నష్టం జరుగుతోంది అనిపించింది ఆమెకు. దీనికి సొల్యూషన్‌‌ కనిపెట్టాలనుకుంది. అలా పుట్టిందే ‘యాజ్ దే గ్రో’ ఐడియా.

ఆన్‌‌లైన్‌‌ ద్వారా..

తన చెల్లి రీతూతో కలిసి అంకిత ‘యాజ్ దె గ్రో’ అనే ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫామ్‌‌ను మొదలుపెట్టింది. ఇది తల్లీపిల్లల వస్తువుల కోసం ఏర్పాటుచేసిన ప్లాట్‌‌ఫామ్. ఇందులో పాత వస్తువులను రీసేల్ చేయడంతో పాటు  కొత్త వస్తువులను కూడా కొనుక్కోవచ్చు. 2020 సెప్టెంబర్‌‌‌‌లో మొదలైన ఈ ప్లాట్‌‌ఫామ్ కొద్ది రోజుల్లోనే బాగా సక్సెస్ అయింది. ఇప్పటివరకూ ఈ ప్లాట్‌‌ఫామ్ ద్వారా 75 వేల మంది పేరెంట్స్ ప్రొడక్ట్స్‌‌ను  కొనడం లేదా అమ్మడం చేశారు. సుమారు ఐదువేల ప్రొడక్ట్స్ ఇల్లు మారాయి.  ఇందులో పిల్లల కోసం బేబీ కాట్స్, బేబీ వాకర్స్, స్ట్రోలర్స్, బేబీ క్యారియర్స్, టాయ్స్, బుక్స్, సైకిల్స్, బట్టలు, తల్లుల కోసం బ్రెస్ట్ పంప్స్, బేబీ ఆయిల్స్, సబ్బులు లాంటివి దొరుకుతాయి. 

దేశమంతటా..

యాజ్ దే గ్రో ప్లాట్‌‌ఫామ్‌‌ను దేశమంతటా విస్తరించడమే తమ గోల్ అని అంకిత, రీతూలు చెప్తున్నారు. అందుకే ఒక  ఆఫీస్ హైదరాబాద్‌‌లో, మరో ఆఫీస్ నాగ్‌‌పూర్‌‌‌‌లో ఏర్పాటుచేశారు. అంకిత హైదరాబాద్ నుంచి,  రీతూ నాగ్‌‌పూర్ నుంచి పనిచేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, నాగ్‌‌పూర్, కోల్‌‌కతా, ముంబై.. ఇలా దేశంలోని అన్ని సిటీల నుంచి వీళ్లకు ఆర్డర్స్ వస్తాయి.  కేవలం ఇన్‌‌స్టాగ్రామ్ పేజీ ద్వారానే బిజినెస్ రన్ చేస్తున్నారు. బేబీ ప్రొడక్ట్స్ కొనాలి లేదా అమ్మాలి అనుకునేవాళ్లు ఇన్‌‌స్టా పేజీలో మెసేజ్ చేస్తే ఆయా సిటీని బట్టి వాళ్ల ప్రొఫైల్, ప్రొడక్ట్స్‌‌ను లిస్ట్ చేస్తారు. అదే సిటీలో ఉన్న ఇతర కస్టమర్ల దగ్గర ఉన్న వాటి వివరాలు అందజేస్తారు. 

ప్లాట్‌‌ఫామ్స్ లేవు

“బేబీ ప్రొడక్ట్స్‌‌కు మనదేశంలో మంచి మార్కెట్ ఉంది. అలాగే వాటి వేస్టేజీ కూడా ఎక్కువే ఉంది. మంచిగా పనిచేస్తున్న బేబీ ప్రొడక్ట్స్​ను వృథాగా పడేయడం వల్ల డబ్బు వృథా అవ్వడంతో పాటు ఎన్విరాన్‌‌మెంట్‌‌కు నష్టం జరుగుతోంది. దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు మన దగ్గర బేబీ ప్రొడక్ట్స్‌‌ను రీసేల్ చేసే ప్లాట్‌‌ఫామ్స్ లేవని అర్థమైంది. అందుకే ‘యాజ్ దే గ్రో’ మొదలుపెట్టాం’’ అని చెప్తున్నారు వీళ్లు. 

ప్రి- లవ్డ్ ప్రొడక్ట్స్

“అందరు పేరెంట్స్ తమ పిల్లలకు కొత్త వస్తువులే కొనాలనుకుంటారు. ఒకరు వాడిన వస్తువులను వాడడానికి చాలామంది  ఇష్టపడరు. కానీ కొంతమంది ఇన్‌‌స్టాగ్రామ్ ఇన్‌‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ముందుకొచ్చి మా ప్లాట్‌‌ఫామ్‌‌లో ప్రొడక్ట్స్ కొనడం వల్ల చాలామంది అభిప్రాయం మార్చుకున్నారు. ఒకరు ప్రేమతో కొన్న వస్తువులను మరొకరు వాడడం వల్ల వాటి వాల్యూ పెరుగుతుందే తప్ప తగ్గదు. అందుకే  వీటిని యూజ్డ్ ప్రొడక్ట్స్ అని కాకుండా ‘ప్రి–లవ్డ్ ప్రొడక్ట్స్’ అని పిలుస్తున్నాం. ఒక వస్తువు చక్కగా పని చేస్తున్నప్పుడు దాన్ని పడేయడం కంటే తిరిగి వాడడమే మేలు. దానివల్ల వేస్టేజీని తగ్గిం చొచ్చు. అందు లోనూ  ఉయ్యాల, బొమ్మలు, స్ట్రోలర్స్ వంటి పిల్లల వస్తువులు అంత త్వరగా పాడవ్వవు. అందుకే వీటిని మళ్లీ వాడుకోవచ్చు. ప్రస్తుతం మా ప్లాట్‌‌ఫామ్ ఇన్‌‌స్టాగ్రామ్ పేజీలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే వెబ్‌‌సైట్ క్రియేట్ చేయబోతున్నాం”