బ్యాడ్​ బ్యాంక్​  వస్తోంది

బ్యాడ్​ బ్యాంక్​  వస్తోంది
  • రూ. 30,600 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీ
  • గత ఆరేళ్లలో రూ. 5.01 లక్షల కోట్ల ఎన్​పీఏలు రికవరీ
  • కేబినెట్​ మీటింగ్​ తర్వాత నిర్మలా సీతారామన్​ వెల్లడి
  • బ్యాంకులకు ఎన్​పీఏల బెడద తగ్గించడానికి


న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా బ్యాడ్​ బ్యాంక్​ ఏర్పాటు చేస్తున్నట్లు ఫైనాన్స్​ మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. ఈ ప్రపోజల్​ను కేంద్ర కేబినెట్​ ఆమోదించినట్లు చెప్పారు. 2021–22 బడ్జెట్​ ప్రసంగంలోనే నేషనల్​ ఎసెట్​ రీకన్​స్ట్రక్షన్​ కంపెనీ (ఎన్​ఏఆర్​సీఎల్​) లేదా బ్యాడ్​ బ్యాంక్​ ఏర్పాటు గురించి నిర్మలా సీతారామన్​ ప్రస్తావించారు. బ్యాంకులకు నాన్​ పెర్​ఫార్మింగ్​ ఎసెట్స్​ బెడద ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ బ్యాడ్​ బ్యాంక్​ ఏర్పాటును ప్రపోజ్​ చేస్తున్నారు. ఎన్​ఏఆర్​సీఎల్​తోపాటు మరో కంపెనీని ఇండియా డెట్​ రిజొల్యూషన్​ పేరిట ఏర్పాటు చేయనున్నామని ఫైనాన్స్​ మినిస్టర్​ తెలిపారు. ప్రభుత్వమూ, ఆర్​బీఐ కలిసి బ్యాంకింగ్​ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు క్యాపిటల్​ కోసం ప్రభుత్వం వైపు చూడకుండా, మార్కెట్లో ఈక్విటీ, అప్పుల రూపంలో డబ్బు తెచ్చుకోగలుగుతున్నాయని మంత్రి చెప్పారు. 2018లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 21 లో రెండు మాత్రమే లాభాలలో ఉన్నాయని, 2020–21 నాటికి రెండు ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే నష్టాలు ప్రకటించాయని పేర్కొన్నారు. 
ఎన్​పీఏల రికవరీపై ప్రత్యేక శ్రద్ధ....
భూషణ్ స్టీల్​, ఎస్సార్​ స్టీల్​ వంటి కంపెనీల నుంచి రూ. 99 వేల కోట్లను రికవరీ చేయగలిగామని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. గత ఆరు ఫైనాన్షియల్​ ఇయర్స్​లో ప్రభుత్వం, ఆర్​బీఐ చొరవ కారణంగా మొత్తం రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయగలిగినట్లు చెప్పారు. మార్చి 2018 నుంచి చూస్తే రూ. 3.1 లక్షల కోట్ల రికవరీ జరిగిందన్నారు. ఎన్​పీఏల విషయంలో ప్రభుత్వం, ఆర్​బీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయని చెబుతూ, రికగ్నిషన్​, రిజొల్యూషన్​, రీక్యాపిటలైజేషన్​, రిఫార్మ్స్​ అనే నాలుగు సూత్రాలను పకడ్బందీగా అమలులోకి తెచ్చినట్లు మంత్రి నిర్మాలా సీతారామన్​ మీడియాకు వివరించారు.

కిందటి నెలలోనే ఆర్​బీఐకి అప్లికేషన్​.....
ఎసెట్​ రీకన్​స్ట్రక్షన్​ కంపెనీతోపాటు, ఎసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీనీ ఏర్పాటు చేయాలనే ప్రకటన బడ్జెట్​లోనే చేశారు. దేశంలోని బ్యాంకులకు ఎన్​పీఏల తలనొప్పి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్​పీఏలను కొత్త కంపెనీలు తీసుకుని, వాటిన తగిన విలువకు కొత్తవారికి అమ్మేస్తాయి. నేషనల్​ ఎసెట్​ రీకన్​స్ట్రక్షన్​ కంపెనీ లిమిటెడ్​ (ఎన్​ఏఆర్​సీఎల్​) కు రూ. 30,600 కోట్ల మేర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి వెల్లడించారు. బ్యాంకుల నుంచి ఎన్​పీఏలను కొనడానికి ఒప్పుకున్న మొత్తంలో 15 శాతాన్ని  ఎన్​ఏఆర్​సీఎల్​ నగదుగా చెల్లించనుండగా, మిగిలిన 85 శాతానికి ప్రభుత్వం గ్యారంటీ రిసీట్స్​ జారీ చేస్తుంది. ఒకవేళ అనుకున్న విలువ రాకపోతే అప్పుడు గవర్నమెంట్​ గ్యారంటీని ఇన్వోక్​ చేస్తారు. ఎన్​ఏఆర్​సీఎల్​ ఏర్పనాటుకు ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ) కిందటి నెలలోనే ఆర్​బీఐకి అప్లికేషన్​ పెట్టింది. అయితే సావరిన్​ గ్యారంటీ ఇవ్వడానికి కేబినెట్​ అనుమతి అవసరమైంది. ఇప్పుడు కేబినెట్​ ఆమోదం దొరకడంతో బ్యాడ్​ బ్యాంక్​ ఏర్పాటు ఈ ఏడాదిలో కార్యరూపంలోకి రానుంది.