
- కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసంతో వంటలు
- పాడైపోయిన, డేట్ దాటిన సరుకులు వాడకం
- పురుగుపట్టిన మైదా, బూజుపట్టిన జీడిపప్పు, ఫుడ్ ఐటమ్స్‌లో బొద్దింకలు
- ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
- హైదరాబాద్‌లో నెలన్నర రోజులుగా ఆఫీసర్ల దాడులు
- టెస్టులకు ఫుడ్ శాంపిల్స్.. మేనేజ్మెంట్లకు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: అవి పేరుకు ఫేమస్ రెస్టారెంట్లు.. స్విగ్గీ, జొమాటో ఓపెన్ చేసినా, గూగుల్‌లో వెతికినా స్టార్ రేటింగ్ 4కి పైగానే ఉంటుంది. కానీ, పైకి పోష్‌గా కనిపించే ఆ రెస్టారెంట్లలో వంటలకు వాడుతున్న ఐటెమ్స్ చూస్తే మాత్రం వాంతి చేసుకోవాల్సిందే. పురుగులు పట్టిన మైదా పిండి, పాడైన చింతపండు, రెండు మూడ్రోజులు నిల్వ ఉంచిన చికెన్, బూజు పట్టిన జీడిపప్పు, డేట్ అయిపోయిన సరుకులు, సగం వండి స్టోర్‌చేసిన ఫుడ్, శుభ్రత లేని కిచెన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ రెస్టారెంట్ల బాగోతం బయటపడ్డది.
స్టార్ రేటింగ్‌లతో వందలు, వేలల్లో బిల్లులు వేస్తున్న ఆ రెస్టారెంట్లు.. ఫుడ్ విషయంలో మాత్రం ఆ స్టార్రేటింగ్ను చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బేకరీలు, ఐస్క్రీమ్పార్లర్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్బుల దాకా అన్నింటిపైనా రెయిడ్స్చేసిన అధికారులు.. అక్కడ వాడుతున్న వస్తువులు, వండుతున్న తీరు, కిచెన్ పరిసరాల్లో అపరిశుభ్రతను చూసి ముక్కున వేలేసుకున్నారు.
నీళ్ల నుంచి నూనె దాకా..
పెద్ద రెస్టారెంట్లలోనూ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నీళ్లను ఫ్రీగా ఇవ్వాల్సిన రెస్టారెంట్లు.. బయట రేటు కంటే రెండు మూడింతల ఎక్కువ ధరకు క్వాలిటీ లేని వాటర్ బాటిళ్లను కస్టమర్లకు అంటగట్టేస్తున్నాయి. అదేమంటే.. అది అంతే అంటూ రెస్టారెంట్ల సిబ్బంది మొహం మీద చెప్పేస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ రూల్స్ ప్రకారం నీళ్లలోని టీడీఎస్ 75 మైక్రోగ్రాములు ఉండాలి. కానీ అంత కన్నా తక్కువ ప్రమాణాలున్న నీళ్లను బాటిళ్లలో నింపేసి క్వాలిటీ వాటర్ అంటూ జనానికి ఇచ్చేస్తున్నారు. ఇటు నూనెలను ఒకట్రెండు సార్లు వాడాక మార్చాల్సి ఉన్నా మార్చడం లేదు. పలు రెస్టారెంట్లలో కల్తీ నూనెలనూ వాడుతున్నట్టు అధికారులు గుర్తించారు.
బేకరీలు, ఐస్ క్రీమ్ పార్లర్లలోనూ అంతే..
పలు రెస్టారెంట్లు, బేకరీల్లో బొద్దింకలు తిరుగుతున్న చోటే ఫుడ్ఐటెమ్స్స్టోర్చేసిన్నట్టు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఓ చోట బిర్యానీని స్టోర్ చేసిన దగ్గర లైవ్బొద్దింకలు ఉన్నా ఆ రెస్టారెంట్ సిబ్బంది మిన్నకుండిపోయారట. ఫుడ్స్టోర్ చేసే ఫ్రిజ్‌లను నీట్‌గా ఉంచడం లేదని తనిఖీల్లో తేలింది. కొన్ని రెస్టారెంట్లలో వెజ్, నాన్వెజ్ఐటెమ్స్ను ఒకేచోట స్టోర్చేస్తున్నారు. బేకరీల్లో డేట్అయిపోయిన బిస్కెట్లు, కేక్‌లు అమ్ముతున్నారు.
ఆయా ప్యాకెట్లపైన తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్లను పెట్టడం లేదు. ఫేమస్ ఐస్‌క్రీమ్ ఔట్‌లెట్లలోనూ ఎక్స్పైర్ అయిన క్రీమ్‌లను వాడుతూ.. అపరిశుభ్రమైన ఫ్రిజ్‌లలో స్టోర్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ ఔట్లెట్లు కోల్డ్ చెయిన్‌ను సరిగ్గా మెయింటెయిన్ చేయడం లేదని తనిఖీల్లో తేలింది. సూపర్మార్కెట్లలోనూ ఫుడ్ స్టాండర్డ్స్‌ను పాటించడం లేదు. చాక్లెట్లు డేట్దాటిపోయి ప్యాక్ చేసిన కవర్లలో నుంచి లీకవుతున్నా అలాగే ఫ్రిజ్‌లో అమ్మకానికి పెడుతున్నారు. పలు ప్యాకేజ్డ్ఫుడ్ఐటెమ్స్నూ డేట్ అయిపోయిన తర్వాత అమ్ముతున్నారు.
సిటీ నలుమూలలా దాడులు
హైదరాబాద్‌సిటీ నలుమూలలా నెలన్నర నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్ద రెస్టారెంట్లనూ వదలకుండా వరుసగా తనిఖీలు చేస్తున్నారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట, హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట సహా ప్రైమ్ఏరియాల్లోని రెస్టారెంట్లు, బార్లు, బేకరీలు, ఐస్క్రీమ్ఔట్లెట్లలో సోదాలు చేస్తున్నారు.
రాయలసీమ రుచులు, షాగౌస్, క్లోవ్రెస్టారెంట్, మినర్వా హోటల్, క్రీమ్‌స్టోన్, నేచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, కామత్ హోటల్, జంబో కింగ్ బర్గర్స్, 36 డౌన్‌టౌన్ బ్రూ పబ్, మకావు కిచెన్ అండ్బార్, టాకో బెల్, బాయిలర్ రూమ్క్లబ్, జీవీకే వన్ మాల్లోని రెస్టారెంట్లు, రత్నదీప్ స్టోర్స్వంటి వాటిల్లో తనిఖీలు చేశారు. ఆయా రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ ఔట్లెట్లు ఫుడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని అధికారులు తేల్చారు. వాటిల్లోని ఫుడ్శాంపిళ్లను టెస్టులకు పంపించి, మేనేజ్ మెంట్లకు నోటీసులు ఇచ్చారు.
ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడైతది
ఇలాంటి ఆహారం తింటే ఆరోగ్యం పాడైపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. షార్ట్టర్మ్లో గ్యాస్ట్రిక్సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీర్ఘకాలంలో మాత్రం కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడడం వల్ల కేన్సర్ వచ్చే ముప్పు ఉందని అంటున్నారు. స్టోర్ చేసిన ఫుడ్‌ను తిరిగి వేడి చేయడం ద్వారా అందులో ఫామ్ అయిన బ్యాక్టీరియా చనిపోయి విష పదార్థాలను విడుదల చేస్తుందని, అది తింటే గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు డయేరియా వస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఫ్రిజ్‌లో పెట్టి.. మరుసటి రోజు సర్వ్
రెస్టారెంట్లలో కుళ్లిన కూరగాయలు వాడుతున్నారు. బూజు పట్టిన క్యారెట్లు, బీన్స్, పుట్టగొడుగులతో వంటలు చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. బిర్యానీతో నాసిరకం ఉల్లిగడ్డలను సర్వ్ చేస్తున్నారు. నాన్స్, రుమాలీ రోటీ వంటి వాటి తయారీ కోసం పురుగులు మైదాను వాడుతున్నారు. బూజు పట్టిన డ్రైఫ్రూట్స్ ను బిర్యానీ, కర్రీల్లో వినియోగిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో అయితే చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను సగం వండి ఫ్రిజ్‌లో పెట్టి.. కస్టమర్ అడిగినప్పుడు మళ్లీ వండి వడ్డిస్తున్నారు.
అంతేగాకుండా మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్‌ను ఫ్రిజ్‌లో దాచి, మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. రెండు మూడ్రోజులు నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను వాడుతున్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. మరికొన్ని రెస్టారెంట్లలో డేట్ అయిపోయిన టీ పౌడర్, చీజ్, బట్టర్, బ్రెడ్లు, బ్రౌన్ షుగర్, పనీర్, సాసులను వినియోగిస్తున్నట్టు బయటపడింది.
హెపటైటిస్, కేన్సర్ వస్తయ్..
కల్తీ ఫుడ్ తింటే షార్ట్టర్మ్లోనే కాదు.. లాంగ్టర్మ్సమస్యలూ వస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో డయేరియా, విరేచనాలు, కడుపు నొప్పి, ఎసిడిటీ వంటివి వస్తాయి. వాడిన నూనెలను మళ్లీ వాడడం వల్ల ఇరిటబుల్బోవెల్సిండ్రోమ్ వంటి సమస్యలు వస్తాయి. కలరింగ్ ఏజెంట్లు, క్లాస్ 2 ప్రిజర్వేటివ్స్వాడకం వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. పేగు, ప్యాంక్రియాటిక్కేన్సర్ల ముప్పు ఉంటుంది.
నిల్వ ఉంచిన ఫుడ్ వల్ల కాలేయ సమస్యలు వస్తాయి. హెపటైటిస్సీ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకుని తినాలి. వండిన ఫుడ్‌ను మళ్లీ హీట్ చేసి తిన కూడదు. దాని వల్ల విష పదార్థాలు విడుదలై డయేరియా వంటి సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల చనిపోయిన జంతువుల కళేబరాల్లోని బొక్కల నుంచి తీసిన ఆయిల్‌తో నూనెల్ని కల్తీ చేస్తున్నారు. వాటి వల్ల పేగులపై దీర్ఘకాల దుష్పరిణామాలు ఉంటాయి.
- డాక్టర్ జేఎస్ హరీశ్ రెడ్డి,
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కిమ్స్