
నిర్మల్, వెలుగు : క్షణికావేశంలో ఓ వ్యక్తి చెరువులో దూకగా.. కాపాడేందుకు అతడి తమ్ముడు సైతం నీటిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిర్మల్ జ్లిలా కేంద్రంలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జిల్లా కేంద్రంలోని నాయుడువాడకు చెందిన మాన్పురి నరేశ్ (43) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
అతడి తమ్ముడు నవీన్ (40) పట్టణంలోనే అరుణోదయ పేపర్ మార్ట్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. మంగళవారం కుటుంబంలో చిన్న గొడవ జరగడంతో క్షణికావేశానికి గురైన నరేశ్ బైక్ తీసుకొని బయటకు వచ్చాడు. అన్నను అడ్డుకునేందుకు నవీన్ సైతం బయటకు వెళ్లాడు. సమీపంలోని బంగల్ చెరువు వద్దకు చేరుకున్న నరేశ్ నీటిలో దూకడంతో అతడిని కాపాడేందుకు నవీన్ సైతం చెరువులోకి దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చెరువు వద్దకు చేరుకొని నీటిలో గాలించగా నరేశ్, నవీన్ డెడ్‌బాడీలు దొరికాయి. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.