
స్నేహమంటే..
టైటిల్ : వర్షంగల్కు శేషం
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్ ఫాం : సోనీలివ్
డైరెక్షన్ : వినీత్ శ్రీనివాసన్
కాస్ట్ : ప్రణవ్ మోహన్‌లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, నివిన్ పాలీ, కళ్యాణి ప్రియదర్శన్, అజు వర్గీస్, బస్లీ జోసెఫ్
ఇది ఒక పీరియాడిక్ సినిమా. 80–90లలో జరిగే కథను ప్రధానంగా చూపించారు. కథలోకి వెళ్తే... సూపర్ హిట్ సినిమాల డైరెక్టర్ వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) తన ఫ్రెండ్ మురళి(ప్రణవ్ మోహన్‌లాల్)ని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణంలో ఒక క్యాబ్ డ్రైవర్(వినీత్ శ్రీనివాసన్)కి తన కథ మొత్తం చెప్తాడు. ఆ కథ ఏంటంటే.. కేరళకి చెందిన వేణుకి చిన్నప్పటినుంచీ నాటకాలు అంటే ఇష్టం. ఊళ్లో జరిగే నాటక ఉత్సవాల్లో యాక్టివ్‌గా పాల్గొనేవాడు. ఒకరోజు అదే నాటకాల ద్వారా మురళి పరిచయం అవుతాడు. అతనికి మ్యూజిక్ బాగా తెలుసు. మురళి టాలెంట్‌ని చూసిన వేణు చెన్నయ్ వెళ్తే మంచి అవకాశాలు దొరుకుతాయని సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వేణుని కూడా తీసుకుని చెన్నయ్ వెళ్తాడు మురళి. అక్కడికి వెళ్లాక వేణు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తుంటాడు. మురళి సంగీత దర్శకుడిగా తన ప్రయత్నాలు మొదలుపెడతాడు. అదే టైంలో మురళి వల్ల వేణుకి డైరెక్షన్ చేసే ఛాన్స్ వస్తుంది. తన మొదటి సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేయమని మురళిని అడుగుతాడు. కానీ.. మురళి మరో మ్యూజిక్ డైరెక్టర్‌తో మ్యూజిక్ చేయిస్తాడు. దాంతో కోపం వచ్చిన వేణు అప్పటివరకు ఇద్దరూ కలిసి ఉంటున్న రూమ్ నుంచి వెళ్లిపోతాడు. దాంతో ఒంటరిగా ఫీల్ అయిన మురళి తాగుడుకి బానిస అవుతాడు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. వేణు డైరెక్టర్‌గా ఎదుగుతూనే ఉంటాడు. కానీ.. మురళి మాత్రం ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరూ మళ్లీ కలిశారా? కలిసి సినిమా తీశారా? అనేది సినిమా.
తోడుగా నిలిచాడు
టైటిల్ : మైదాన్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
డైరెక్షన్ : అమిత్ రవీందర్‌నాథ్ శర్మ
కాస్ట్ : అజయ్ దేవగన్, గజరాజ్ రావ్, ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ, తేజస్ రవిశంకర్, అమర్త్య రే, సుశాంత్ వయదండే, దేవిందర్ గిల్
ఒలింపిక్ గేమ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఓడిపోతుండడంతో టీమ్‌ని గెలిపించడానికి ఒక కొత్త కోచ్‌ని నియమిస్తారు. అతనే హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీం(అజయ్ దేవగణ్). కానీ.. బెంగాల్ ఫుట్‌బాల్ బోర్డు మెంబర్స్ రహీంను చూసి అవహేళన చేస్తారు. అయినా.. రహీం తన టీంని ఎలాగైనా గెలిపించాలి అనుకుంటాడు. 1952లో ఎన్నో అంచనాలతో జట్టు బరిలోకి దిగుతుంది. కానీ.. ఘోరంగా ఓడిపోతుంది. దాంతో అందరూ టీంని అవమానిస్తుంటారు. రహీంని కోచ్ పదవి నుంచి తొలగిస్తారు. అయినా.. రహీం ఆటగాళ్లకు అండగా నిలబడతాడు. అదే టైంలో రహీంకు లంగ్ క్యాన్సర్ అని కూడా తెలుస్తుంది. అప్పుడు రహీం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? టీంని ఎలా రెడీ చేశాడు? ఆ తర్వాత జరిగిన టోర్నమెంట్లలో టీమ్ ఇండియా ఎలా రాణించింది? రహీంకు మళ్లీ కోచ్‌గా ఎలా అవకాశం వచ్చింది?
కబీర్ ఎవరు?
టైటిల్ : బడే మియా ఛోటే మియా
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్ : అలీ అబ్బాస్ జాఫర్
కాస్ట్ : అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్
ఫ్రెడ్డీ అలియాస్ ఫిరోజ్ (అక్షయ్ కుమార్), రాకేష్ అలియాస్ రాఖీ ఇండియన్ ఆర్మీలో మార్షల్ ఆఫీసర్లు. అఫ్గానిస్తాన్‌లో ఒక ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాక వీళ్లు బడే మియా, ఛోటే మియాగా ఫేమస్ అవుతారు. బెస్ట్ సోల్జర్స్‌గా గుర్తింపు పొందుతారు. కానీ.. కొన్ని కారణాల తర్వాత వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. దాంతో ఎవరి ప్రపంచంలో వాళ్లు హాయిగా బతుకుతుంటారు. అలాంటి టైంలో ఎనిమిదేండ్లకు మళ్లీ ఇండియన్ ఆర్మీ నుంచి పిలుపొస్తుంది. దానికి కారణం ఏంటంటే.. కబీర్ (పృథ్వీరాజ్ సుకుమారన్) భారత సైన్యం నుండి ఒక ప్యాకేజీని దొంగిలిస్తాడు. కొంతమంది సైనికులను కూడా చంపేస్తాడు. అతను దొంగిలించిన ప్యాకేజీని లండన్‌కి తీసుకెళ్తాడు. దాన్ని తిరిగి తీసుకురావడానికి కెప్టెన్ మిషా (మానుషి చిల్లర్)తో కలిసి బడేమియా, ఛోటేమియా వెళ్తారు. ఇంతకీ ఆ ప్యాకేజీలో ఏముంది? దాన్ని తీసుకెళ్లిపోయిన కబీర్ ఎవరు? అతని కథేంటి? ఆ ప్యాకేజీని తిరిగి తీసుకొచ్చారా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
నగరం చీకట్లో ఉన్నప్పుడు
టైటిల్ : బ్లాక్‌అవుట్
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : జియో సినిమా
డైరెక్షన్ : దేవాంగ్ షాషిన్ భవ్సర్
కాస్ట్ : విక్రాంత్ మస్సే, మౌనీ రాయ్, సునీల్ గ్రోవర్, జిష్షు సేన్‌గుప్తా, రుహానీ శర్మ, ప్రసాద్ ఓక్
కథ అంతా ఒక రాత్రిలో జరిగిపోతుంది. పుణే సిటీలో ఒక దొంగల ముఠా వెరైటీగా దొంగతనాలు చేస్తుంటుంది. దొంగతనం చేయాలి అనుకుంటున్న ఏరియాలోని సబ్ స్టేషన్ మీద దాడి చేసి, అక్కడ డ్యూటీలో ఉన్నవాళ్లకు మత్తు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత ఆ ఏరియా అంతటా కరెంటు సప్లయ్ ఆపేసి, బ్యాంకుల్లో దొంగతనాలు చేస్తారు. అలా ఒకరోజు దొంగతనం చేసి, వ్యాన్‌లో పారిపోతుంటే.. యాక్సిడెంట్ అవుతుంది. అందులో ఉన్నవాళ్లంతా చనిపోతారు. అదే టైంలో క్రైమ్ రిపోర్టర్ లెన్నీ డిసౌజా (విక్రాంత్ మాస్సే) తన భార్య చెప్పిన సరుకులు తీసుకెళ్లడానికి రోడ్డు మీదకు వస్తాడు. అప్పుడు బోల్తా పడి ఉన్న దొంగల వ్యాన్‌ని చూస్తాడు. అక్కడ పడి ఉన్న డబ్బు, బంగారం పెట్టెల్లో నుంచి ఒకదాన్ని తీసుకుని, కారులో వేసుకుని బయల్దేరుతాడు. అలా కంగారుగా వెళ్తూ.. ఒక వ్యక్తికి కారుతో డ్యాష్ ఇస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా ఫాలోవర్లు లేని ఇన్‌ఫ్లుయెన్సర్ బెవ్ద్యా ( సునీల్ గ్రోవర్ ), ఇద్దరు దొంగలు థిక్, థాక్ (కరణ్ సోనావేర్, సౌరభ్ ఘడ్గే)తో లెన్నీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? లెన్నీ దగ్గరకు ఆ దొంగలు ఎందుకు వచ్చారు? చివరకు ఆ డబ్బు ఉన్న పెట్టె ఎవరికి దక్కింది? సినిమా చూస్తే తెలుస్తుంది.
పగతో రూపం మార్చిన శివ
టైటిల్ : గునాహ సీజన్ –1
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డైరెక్షన్ : అనిల్ సీనియర్
కాస్ట్ : సురభి జ్యోతి, గశ్మీర్ మహాజని, జైన్ ఇబాద్
అభిమన్యు (గష్మీర్ మహాజని) బాగా ధనవంతుడు. అతనికి సొంత ప్రైవేట్ జెట్ కూడా ఉంటుంది. అంత డబ్బున్న అతనికి జూదం ఆడడం అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఒకసారి గోవాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి క్యాసినోకు వెళ్తాడు. అయితే.. అభిమన్యు అక్కడికి వెళ్లింది కేవలం డబ్బు గెలవడానికే కాదు. దానికి మరో కారణం కూడా ఉంటుంది. కొందరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తాడు. వాస్తవానికి అభిమన్యు అసలు పేరు శివ ( జైన్ ఇబాద్ ఖాన్). కానీ.. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అభిమన్యులా పేరు, రూపం మార్చుకుంటాడు. శివకు తన ఫ్రెండ్స్ తార ( సురభి జ్యోతి ), మైఖేల్ (శశాంక్ కేత్కర్), జేకే (దర్శన్ పాండ్య) తీరని ద్రోహం చేస్తారు. వాళ్ల మీద కోపంతోనే అభిమన్యుగా మారి పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. ఇంతకీ అతనికి తన ఫ్రెండ్స్ చేసిన ద్రోహం ఏంటి? తన ఫ్రెండ్స్ మీద పగ తీర్చుకున్నాడా? లేదా? అతని గతమేంటి? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి.
మధ్యతరగతి కుటుంబ సమస్యలు
టైటిల్ : గుల్లక్ సీజన్ 4
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్ ఫాం : సోనీలివ్
డైరెక్షన్ : శ్రేయాన్ష్ పాండే
కాస్ట్ : జమీల్ ఖాన్, గీతాంజలి కులకర్ణి, వైభవ్ రాజ్‌గుప్తా, హర్ష్ మేయర్, శివాంకిత్ సింగ్ పరిహార్, సునీతా రాజ్వార్.
గుల్లక్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు వచ్చి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నాలుగో సీజన్ రిలీజ్ అయింది. ఈ కథ ఒక మధ్య తరగతి భారతీయ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొదటి మూడు సీజన్లలో ఉన్నట్టే ఇందులో కూడా కొన్నిసార్లు 90ల నాటి సీన్లు చూస్తున్నట్టు అనిపిస్తుంది. -తల్లి శాంతి (గీతాంజలి కులకర్ణి), తండ్రి సంతోష్ (జమీల్ ఖాన్), వాళ్ల పెద్ద కొడుకు అన్ను (వైభవ్ రాజ్ గుప్తా) మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటాడు. అమన్ (హర్ష్ మాయర్) చదువుకుంటుంటాడు. ఈ కుటుంబం రకరకాల సమస్యలతో బాధపడుతుంటుంది. దాని వల్ల ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నింటినీ అధిగమించి వాళ్లు ఎలా నిలదొక్కుకోగలిగారు? అనేది ఈ సిరీస్‌లో చూపించారు.