బ్యాడ్మింటన్‌: సౌరభ్‌‌‌‌‌‌‌‌ వర్మ సూపర్‌‌‌‌ విక్టరీ

బ్యాడ్మింటన్‌: సౌరభ్‌‌‌‌‌‌‌‌ వర్మ సూపర్‌‌‌‌ విక్టరీ

స్లొవేనియా ఇంటర్నేషనల్‌‌ బ్యాడ్మింటన్‌‌ టోర్నమెంట్‌‌లో టాప్‌‌సీడ్‌‌ సౌరభ్‌‌ వర్మ థ్రిల్లింగ్‌‌ విక్టరీతో ఫైనల్‌‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌‌ సెమీస్‌‌లో డెన్మార్క్‌‌ ప్లేయర్‌‌ కరన్‌‌రాజన్ రాజరాజన్‌‌పై ఉత్కంఠవిజయం సాధించాడు. దాదాపు గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌‌లో సౌరభ్‌‌ 21–13, 16–21, 25–23తో కరన్‌‌పై మూడు గేమ్‌‌లపాటు పోరాడి గెలుపొందాడు. ముఖ్యంగా హోరాహోరీగా సాగిన మూడోగేమ్‌‌లో ఇరువురు ప్లేయర్లు కొదమసింహాల్లా పోరాడడంతో ఆధిక్యం ఇరువైపులా దోబుచూలాడింది. చివరకు 23–23తో మ్యాచ్‌‌ సమంగా ఉన్న దశలో వరుసగా రెండు పాయింట్లు సాధించి సౌరభ్‌‌ విజయాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన తొలి గేమ్‌‌లను సౌరభ్‌‌ సునాయాసంగా నెగ్గాడు. అయితే రెండోగేమ్‌‌లో అనూహ్యంగా సౌరభ్‌‌ తడబడడంతో మ్యాచ్‌‌ మూడోగేమ్‌‌కు దారితీసింది. ఫైనల్లో నాలుగోసీడ్‌‌, జపనీస్‌‌ ప్లేయర్‌‌ మినోరు కోగాతో సౌరభ్ తలపడనున్నాడు. మరో ఇండియన్‌‌ హర్షిల్‌‌ డానీ పోరాటం క్వార్టర్స్‌‌లోనే ముగిసింది. ఆ మ్యాచ్‌‌లో ఎనిమిదో సీడ్ హర్షిల్‌‌ 13–21, 21–8, 19–21తో ఫ్రాన్స్‌‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌‌ చేతిలో అనూహ్య ఓటమిపాలయ్యాడు. తొలిగేమ్‌‌ ఓడిపోయి షాక్‌‌ తిన్న హర్షిల్‌‌.. రెండోగేమ్‌‌ను ఏకపక్షంగా కైవసం చేసుకున్నాడు. అయితే మూడోగేమ్‌‌లో ప్రత్యర్థి మెరుగ్గా ఆడి గేమ్‌‌తోపాటు మ్యాచ్‌‌ను కైవసం చేసుకున్నాడు.

మహిళల డబుల్స్‌‌లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించిన ఇండియన్ ద్వయం పూజ దండు–సంజన సంతోష్‌‌ ఫైనల్​ చేరుకుంది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌‌లో టాప్‌‌సీడ్‌‌ పూజ జోడీ 21–18, 21–14తో ఇంగ్లండ్‌‌కు చెందిన లిజిల్‌‌ టోల్‌‌మన్‌‌–హోప్‌‌ వార్నర్‌‌పై సునాయాస విజయం సాధించింది. సెమీస్‌‌లో పూజ జోడీ.. డెన్మార్క్‌‌కు చెందిన ద్వయం సోఫియా గ్రుండ్‌‌విగ్‌‌–ఫ్రెడరిక్‌‌ లున్‌‌ పై 21–18, 21–14పై నెగ్గింది.