గరంగరంగా భద్రాద్రికొత్తగూడెం జడ్పీ సమావేశం     

గరంగరంగా భద్రాద్రికొత్తగూడెం జడ్పీ సమావేశం     
  • డీడీలు కట్టి నెలలు గడుస్తున్నా ఆయిల్​పామ్​ మొక్కలు ఇస్తలే
  • ఫారెస్టోళ్లు గిరిజన మహిళలపై జులుం చేస్తున్రు 
  • ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా పరిషత్​ సమావేశంలో అధికారులు ఏదో ఒకటి చెప్పి కాలం వెళ్లదీస్తున్నారే తప్ప ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ మీటింగ్​హాల్లో జడ్పీ​చైర్మన్​ కోరం కనకయ్య అధ్యక్షతన గురువారం జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లాలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు సమావేశంలో సమస్యలు ప్రస్తావించి వాటిని ఆఫీసర్లు పరిష్కరించకపోవడంతో తాము మాట పడుతున్నామని అసహనం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్​ మొక్కల కోసం డీడీలు కట్టి మూడు నెలలు కావొస్తున్నా అతీగతీ లేదని హార్టికల్చర్​ జిల్లా అధికారి మరియన్నపై జడ్పీ చైర్మన్​ మండిపడ్డారు. సబ్సిడీలు సరిగా రావడం లేదన్నారు. పోడు భూముల సమస్య జిల్లాలో దారుణంగా ఉందని పలువురు ప్రజాప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు జాయింట్​ సర్వే చేపడతామని చెప్పి మరిచి పోయారని అన్నారు.

పోడు భూములపై ఫారెస్ట్​ అధికారులు మభ్య పెడుతున్నారని చెప్పారు. ఫారెస్ట్​ అధికారులు గిరిజన మహిళలపై దాడులు చేస్తూ జాకెట్లు చింపడం, చీరలు పట్టుకొని లాగడం, తాకరాని చోట తాకడం దారుణమన్నారు. పండ్ల మొక్కలు అడవుల్లో పెంచకపోవడంతో కోతులు పంటలను నాశనం చేయడంతో పాటు గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్​ అనుదీప్​ మాట్లాడుతూ దసరా తర్వాత పోడు భూముల పట్టాల కోసం చేసుకున్న దరఖాస్తులపై సర్వే చేస్తామని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇసుక దొరకడం లేదని, ఇసుక దందా చేసే వారికి అడ్డుకట్ట వేయడం లేదని పలువురు సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. గోదావరితో పాటు వాగులు ఉన్నా ఇసుకను అధిక ధరకు కొనే పరిస్థితి ఉందన్నారు. 

ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం

కాంగ్రెస్​ జడ్పీటీసీ వెంకటరెడ్డి మాట్లాడుతుండగా టీఆర్ఎస్​ పార్టీకి చెందిన కో ఆప్షన్​ సభ్యుడు, జడ్పీ వైస్​ చైర్మన్​ అడ్డురావడంతో ఇరు పక్షాల మధ్య కొంతసేపు మాటల యుద్దం సాగింది. సుజాతనగర్​ జడ్పీహెచ్ఎస్​లో డైనింగ్​హాల్​ నిర్మించి ఏడాది కావస్తున్నా ప్రారంభించకపోవడంతో స్టూడెంట్స్​ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కలెక్టర్​ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు జడ్పీ మీటింగ్​లో ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్​ అవార్డులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కలెక్టర్​ను సన్మానించారు.

అశ్వారావుపేట మండలంలో విలేకర్లపై ఫారెస్ట్​ అధికారులు దాడులు చేయడంపై పలువురు పాత్రికేయులు జడ్పీ చైర్మన్, కలెక్టర్, డీఎఫ్​వో దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలాఉంటే అజెండాలో పెట్టిన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగకుండానే మీటింగ్​ను ముగించారు. జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ దిండిగాల రాజేందర్  పాల్గొన్నారు. 

హాజరు కాని ఎమ్మెల్యేలు

జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​కు జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరూ కూడా హాజరు కాలేదు. మరోవైపు జడ్పీటీసీలు, ఎంపీపీలు సగం మందే హాజరయ్యారు. కీలకమైన జడ్పీ జనరల్​ బాడీ మీటింగ్​కు ప్రజాప్రతినిధులు రాకపోవడం చర్చానీయాంశంగా మారింది.  

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

ములకలపల్లి,వెలుగు: మండలంలోని గుండాలపాడు గ్రామానికి బీటీ రోడ్డు కోసం రూ.5 కోట్లు మంజూరైనట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే  నాగేశ్వరరావు తెలిపారు. గురువారం గుండాలపాడు గ్రామంలో పలు శాఖల ఆఫీసర్లతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ సర్పంచ్ కూతురికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. పోగల్లపల్లిలో అనారోగ్యంతో చనిపోయిన గజ్జల సందీప్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తహసీల్దార్  వీరభద్రం, ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీడీవో చిన నాగేశ్వరావు, రైతుబంధు అధ్యక్షుడు నాగల వెంకటేశ్వరావు, సర్పంచ్ కారం కుమారి, ఎంపీటీసీ సరోజిని పాల్గొన్నారు.