బోల్తా కొట్టిన బీఎస్పీ.. 108 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవని పార్టీ

బోల్తా కొట్టిన బీఎస్పీ.. 108 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవని పార్టీ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బోల్తా కొట్టింది. 108 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట కూడా గెల్వలేదు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అయినా గెలుస్తారేమో అని అనుకున్నప్పటికీ సిర్పూర్ నియోజకవర్గంలో పోటీకి దిగి మూడో స్థానానికే పరిమితం అయ్యారు. బీఎస్పీ దళితుల ఓటు బ్యాంకును సొంతం చేసుకుంటుందని బయట టాక్ వచ్చినప్పటికీ ఆ స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. 2014లో బీఎస్పీకి 1.35శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018లో 2.07 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీల్లో టికెట్ రానోళ్లు కూడా బీఎస్పీ నుంచి పోటీ చేసి గతంలో గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ప్రతి నియోజకవర్గంలో యావరేజ్​గా 2 వేల నుంచి 3 వేల ఓట్లు చీల్చుతుందని భావించగా.. అందుకు భిన్నంగా ఈసారి 1.40 శాతం ఓట్లకు తగ్గింది.

గతేడాది జరిగిన మునుగోడు బై ఎలక్షన్స్​లో బీఎస్పీ పోటీలోకి దిగింది. అక్కడ పోటీ చేసిన ఆనందోజు శంకరాచారికి 4,145 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఈ ఎన్నికల్లో  స్వేరో సభ్యులు బీఎస్పీకి  ప్రచారం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా హెలికాప్టర్ వేసుకుని విస్తృత ప్రచారం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. అయినప్పటికీ ప్రజలు ఆయనకు మద్దతుగా నిలువలేదు.

ఓట్లను చీల్చి ఒకటి, రెండు స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తారని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టడంలో విఫలమయ్యారు. ఐపీఎస్​గా ఉండి సుదీర్ఘ కాలం గురుకులాల సెక్రటరీగా కొనసాగిన ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్.. వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరారు. తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడిగా నియమాకమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ పాదయాత్ర చేశారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకులపై నిరుద్యోగులతో కలిసి విస్తృత పోరాటం చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు.