గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

న్యూఢిల్లీ:  కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన స్వస్థలం బళ్లారి వెళ్లేందుకు ఆయనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అంతేకాదు 2015 జనవరిలో ఇచ్చిన కేసు బెయిల్‌ షరతుల్లో కీలకమైన షరతును సడలించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం  గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ చేసింది. గతంలో బళ్లారి, అనంతపురం పట్టణాలను సందర్శించ కూడదన్న షరతులతో ఇచ్చిన బెయిల్ ఆంక్షలను సవరించింది. 
గాలి జనార్థన్ రెడ్డి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ వాదనలు వినిపించగా, సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఏఎస్జీ మాధవిదివాన్ వాదించారు. కేసు నమోదు చేసి 11 ఏళ్లు అవుతున్నా ఈ కేసుల విచారణ సీబీఐ ప్రారంభించలేదని, గతంలో బెయిలుపై ఉన్న సమయంలో గాలి ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని, షరతులతో 8 సార్లు బళ్లారికి వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు కల్గించలేదని గాలి జనార్థన్ రెడ్డి తరఫు లాయర్‌ ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. బెయిల్ పై అభ్యంతరం చెబుతున్న సీబీఐ ఇప్పటి వరకు సమర్పించిన పత్రాలన్నీ 2011 మునుపటివేనని తెలిపారు.
కేసు విచారణలో ఇబ్బందులు వస్తాయన్న సీబీఐ తరపు లాయర్ అభ్యంతరం  తెలపడంతో షరతులతో 8 వారాలు బెయిల్ సడలింపులిచ్చింది. బళ్లారి, కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లాల్సి ఉందని గాలి జనార్థన్ రెడ్డి కోరగా.. ఈ మూడు జిల్లాలకు వెళ్లేందుకు 8 వారాలపాటు బెయిల్ షరతులు సడలించింది. అయితే ఈ జిల్లాలకు వెళ్లేటప్పుడు జిల్లా ఎస్పీలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి కేసు విచారణ నవంబర్ 3వ వారానికి వాయిదా వేసింది.