
సీనియర్ ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఇవాళ గురువారం (సెప్టెంబర్ 4న) నిమ్మకూరుకి వెళ్లిన బాలయ్య.. తమ తల్లి తండ్రులు స్వర్గీయ ‘ఎన్టీఆర్.. బసవతారకం’ విగ్రహాలకు నివాళులర్పించారు.
ఈ 2025 ఏడాది, బాలకృష్ణకు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించింది. బాలయ్య తన 50 ఏళ్ల సినీ ప్రస్థానం విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. అలాగే దేశంలో తొలిహీరోగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సైతం చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నేడు ‘ఎన్టీఆర్.. బసవతారకం’ విగ్రహాలకు నివాళులర్పించి, వారిని స్మరించుకున్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణకు గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్తో స్వాగతం పలికారు. అలాగే, నిమ్మకూరు ఆడపడుచులు బాలయ్యకు మంగళ హారతిలిచ్చారు. అక్కడున్న అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నా వరుస సినీ విజయాలను.. ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులు నాకు ముఖ్యం కాదు... వాటికే నేను అలంకారమన్నది నా భావన. ఈ విజయాలన్నీ తమ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్న.
►ALSO READ | PM MODI: అల్లు కనకరత్నమ్మ మృతిపై సంతాపం తెలిపిన ప్రధాని మోడీ
తండ్రైన. .గురువైన.. దేవుడైన నాకు అన్ని.. మా నాన్న ఎన్టీఆరే. భిన్నమైన పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్.. దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి... తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం ఎనలేనిది" అని బాలకృష్ణ గుర్తుకుచేసుకున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ముందు అఖండ 2 రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 25నే రావాల్సి ఉండగా, విడుదల వాయిదా వేసుకుని డిసెంబర్లో రావడానికి సిద్దమైంది. అలాగే, వీరసింహ రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.