హుజూరాబాద్​ నియోజకవర్గానికి రూ.50లక్షలు కేటాయిస్తా : బల్మూరి వెంకట్‌‌ 

హుజూరాబాద్​ నియోజకవర్గానికి రూ.50లక్షలు కేటాయిస్తా : బల్మూరి వెంకట్‌‌ 

జమ్మికుంట/హుజూరాబాద్‌‌, వెలుగు : హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.50లక్షలు కేటాయిస్తానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్‌‌ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ప్రజలు హర్షించరన్నారు. అంతకుముందు హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నియోజకవర్గ ఇన్‌‌చార్జి ప్రణవ్​తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీకి వచ్చే నిధుల నుంచి రూ.50 లక్షలు నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

ఇక్కడ ప్రణవ్ ఒక్కడే లేడని, ఆయనకు తాను ఓ సోదరుడిలా అండగా ఉంటానన్నారు. దళిత బంధు, ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. పీవీ పేరిట హుజూరాబాద్‌‌ను జిల్లా చేసేందుకు సీఎంతో మాట్లాడుతున్నానన్నారు. అనంతరం జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆరుకాల వీరేశలింగం, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, రామారావు, పెద్ది కుమార్, నాగేంద్ర, శ్రీనివాస్, సలీం పాషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.