నిజాంషుగర్స్​ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఇంకెన్నాళ్లు?

నిజాంషుగర్స్​ భూముల రిజిస్ట్రేషన్లపై  నిషేధం ఇంకెన్నాళ్లు?

నిజాంషుగర్స్​ భూముల రిజిస్ట్రేషన్లపై  నిషేధం ఇంకెన్నాళ్లు?
ధరణిలో క్లియర్ గా ఉంది​.. 
స్లాట్​ కూడా బుకవుతోంది.. కానీ రిజిస్ట్రేషన్లు బంద్​ పెట్టిన ఆఫీసర్లు


నిజామాబాద్​, వెలుగు:    ధరణిలో క్లియర్​గా ఉంది..  స్లాట్​కూడా బుక్​అవుతోంది.. కానీ రిజిస్ట్రేషన్లు చేయడంలేదు.. నిజాంషుగర్స్​కు చెందిన అగ్రికల్చర్​ల్యాండ్స్​ పరిస్థితి ఇది. గతంలో కార్పొరేషన్​ఇచ్చిన భూములు అనే ఒకే ఒక్క కారణంతో 9వేల ఎకరాల పట్టాభూములపై నిజామాబాద్​ జిల్లా ఆఫీసర్లు అప్రకటిత నిషేధం అమలుచేస్తున్నారు. ఫలితంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. విషయం తెలియక ఇప్పటికే భూములు అమ్మి అడ్వాన్స్​లు తీసుకున్నవాళ్లు వాటిని పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు మళ్లించారు. ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వలేక, కొన్నవారికి రిజిస్ట్రేషన్​ చేయించలేక నరకం అనుభవిస్తున్నారు.

ఇదీ జరిగింది..

బోధన్​లోని నిజాంషుగర్స్​లో చక్కెర ఉత్పత్తికి కావల్సిన ముడిసరుకు చెరకును సొంతగా సాగు చేయడానికి నిజాం ప్రభువు మిల్లు చుట్టూ సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో 16,395 ఎకరాల భూమి సేకరించారు.  అప్పట్లో కేవలం చెరుకు పండించడానికే  ఈ భూమిని ఉపయోగించేవారు.  పంట సాగు పర్యవేక్షణకు కోటగిరి, బోధన్​, ఎడపల్లి, రెంజల్​ మండలాల్లో 11 ఫారాలను పాలనా కేంద్రాలుగా ఏర్పాటు చేసి అధికారులు, ఉద్యోగులను నియమించారు. సాగు నష్టాలు పెరగడంతో 1996  నుంచి 2002 వరకు పలు విడతల్లో భూముల అమ్మకం ప్రారంభించారు.  రైతులు వేలం పాటలో 6 వేల ఎకరాల దాకా కొనుగోలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం మరో 9 వేల ఎకరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు విక్రయించింది. 
 
పూర్తిస్థాయిలో  యాజమాన్య హక్కులు

ప్రభుత్వ కార్పొరేషన్లు కొనుగోలు చేసిన నిజాం షుగర్స్​ భూములను ఫారాలలోని ఆయా సామాజిక వర్గాలకు కుటుంబానికి ఎకరం చొప్పున పంపిణీ చేశారు.  అప్పటి మార్కెట్​ ధర ప్రకారం ఎకరానికి రూ.20 వేలు నిర్ణయించి  లబ్ధిదారుల కంట్రిబ్యూషన్​ కింద రూ.5 వేలు తీసుకొని, మిగిలిన రూ.15 వేలను ఏడాదికి కొంత చొప్పున కిస్తీ రూపంలో చెల్లించాలని సూచించారు. ఈ క్రమంలో ఆయా లబ్ధిదారులకు  రిజిస్ట్రేషన్లు కూడా చేసి పూర్తి స్థాయి యాజమాన్య హక్కు కల్పించారు.  2006–-07లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసింది. దీంతో నిజాంషుగర్స్​ భూములను కార్పొరేషన్​ల ద్వారా పొందిన లబ్దిదారుల రుణాలు పూర్తిగా మాఫీ అయ్యి, పూర్తిస్థాయి యజమానులయ్యారు. 

 అమ్మకాలు..కొనుగోళ్లు

పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు రావడంతో రైతులు తమ అవసరాల కోసం భూములను అమ్మడం, కొనడం చేశారు. రిజిస్ట్రేషన్​ శాఖ రిజిస్ట్రేషన్లు చేయగా,  రెవెన్యూ అధికారులు మ్యూటేషన్లు చేసి పట్టాదారు పాస్​బుక్​లు అందిస్తూ వచ్చారు. ఈ లావాదేవీలకు ఆమోదం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ)కూడా  రెవెన్యూ శాఖకు లిఖితపూర్వకంగా స్పష్టత ఇచ్చారు. ఈక్రమంలో ఒక్కో సర్వేనంబర్​పై పదేసి రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. కానీ ధరణి వచ్చాక కొత్త చిక్కులు సృష్టించారు. 

రిజిస్ట్రేషన్లు బంద్​.. 

ధరణిలో స్లాట్​ బుక్​ అవుతున్నా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్లు మాత్రం చేయడంలేదు. భూమిని అమ్మినవాళ్లు  తాము తీసుకున్న అడ్వాన్సులను వేరే అవసరాలకు వాడుకున్నారు. తీరా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కొన్నవాళ్లకు రిటర్న్​ చేయలేకపోతున్నారు. ఎడపల్లి మండలంలో ఒక వ్యక్తి నాలుగు ఎకరాలను రూ.కోటి 80 లక్షలకు కొనుగోలు చేసి అందులో సగం డబ్బును అడ్వాన్సుగా ఏడాది కింద అందజేశాడు. కానీ భూమి రిజిస్ర్టేషన్ కాకపోవడంతో​  అడ్వాన్స్​తిరిగి ఇమ్మని అడిగినా అమ్మిన వ్యక్తి ఇవ్వలేని పరిస్థితి. ఇక జిల్లా కేంద్రానికి చెందిన ఒక డాక్టర్​ రూ.40 లక్షలకు ఎకరం ఒప్పందంతో భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్​ కోసం చూస్తున్నారు. కూతురు పెళ్లి కోసం ఈ భూమిని పట్టాదారు విక్రయించాడు.  ఇలాంటి కేసులు వందల్లో ఉన్నాయి. 

వారం పది  రోజుల్లో క్లారిటీ

ఈ ఇష్యూ గురించి గవర్నమెంటుకు లెటర్​ రాశామని పది రోజుల్లో  స్పష్టత వస్తుందని కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు ఇటీవల జడ్పీ మీటింగ్​లో సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ భూములు అసైన్​మెంట్​ కిందికి రాకపోయినా కొన్ని అనుమానాల రీత్యా క్లారిటీ కోరామన్నారు. 
- కలెక్టర్​ రాజీవ్​గాంధీ హన్మంతు