సింగిల్ యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం

సింగిల్  యూజ్​ ప్లాస్టిక్​పై​ నిషేధం

హైదరాబాద్, వెలుగు: బయో వ్యర్థాల నిర్వహణ నిబంధనలు కఠినంగా అమ‌లు చేయాలని  అధికారులను మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ మార్గద‌ర్శకాల ప్రకారం జులై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం రాష్ట్రంలో అమ‌లు కానుంద‌ని తెలిపారు. నగరాలు, పట్ణణాల్లో కాలుష్యం, చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణకు మున్సిప‌ల్, ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్​లోని అర‌ణ్య భ‌వ‌న్​లో కాలుష్య నియంత్రణ మండ‌లి అధికారుల‌తో మంత్రి సమీక్షించారు. గాలి, నీళ్లు, శబ్ధ కాలుష్య నియంత్రణ, నివార‌ణ‌, బయో మెడిక‌ల్ వేస్టేజీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్​పై బ్యాన్, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేష‌ణ‌, న‌దీ జ‌లాల కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చ‌ర్యల‌పై మంత్రి రివ్యూ చేశారు. రాష్ట్రంలో 11 కామన్‌ బయోమెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ కేంద్రాల్లో బయో మెడికల్ వ్యర్థాలను సైంటిఫిక్​పద్ధతిలో నిర్వీర్యం చేస్తున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. బయోవ్యర్థాలను తరలించే వాహనాలకు జీపీఎస్‌ అనుసంధానించిందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..  బ‌యో మెడిక‌ల్ వేస్టేజీ నిర్వహ‌ణ‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండ‌లి మార్గద‌ర్శకాల‌ను పాటించని ఆస్పత్రులపై కఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప‌రిశ్రమ‌ల  నుంచి వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలన్నారు. వ్యర్థ జలాల శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహ‌ణ‌, ప‌నితీరును ఎప్పటికప్పుడు ప‌ర్యవేక్షించాల‌న్నారు. రాష్ట్రంలో మరిన్ని మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉంద‌ని, అందుకు డీపీఆర్​లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.