ఈ ఊళ్లో ప్రతీ ఇంటి గడప ముందు కనిపించిన తెల్ల ఆవాలు.. సర్పంచ్ ఎన్నికల వేళ హాట్ టాపిక్గా మారిన ఘటన

ఈ ఊళ్లో ప్రతీ ఇంటి గడప ముందు కనిపించిన తెల్ల ఆవాలు.. సర్పంచ్ ఎన్నికల వేళ హాట్ టాపిక్గా మారిన ఘటన

వికారాబాద్: వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కెపల్లిలో మూఢనమ్మకాల కలకలం రేగింది. గ్రామంలో ప్రతి ఇంటి గడప ముందు తెల్ల ఆవాలు కనిపిచండంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. మొదట ఓ ఇంటి ముందు గమనించిన స్థానికులు వారి వారి ఇళ్ళ గడపల ముందు గమనించగా ప్రతి ఇంటి ముందు తెల్ల ఆవాలు కనిపించాయి. తెల్ల ఆవాల వ్యవహారంతో కొంత ఆందోళన చెందామని గ్రామస్తులు వాపోయారు. 

ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు ఓ మహిళ ఇంటి గడపల ముందు ఆవాలు చల్లుతూ వెళ్ళింది గమనించామని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓడిపోతామనే భయంతో ఇలాంటి పనులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వనజమ్మతో పాటు ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మూఢనమ్మకాల వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రియా రెడ్డి చేయించిన పని అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వనజమ్మ మద్దతుదారులు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను ఇండిపెండెంట్ అభ్యర్థి డాక్టర్ ప్రియా రెడ్డి ఖండించారు. తను ఒక డాక్టర్నని.. తను ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మనని చెప్పారు. కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె తెలిపారు. గెలవలేక ఇలాంటి మూఢ నమ్మకపు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. మొత్తంగా దొంగ ఎన్కెపల్లి రాజకీయాలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా హాట్ టాపిక్గా మారాయి.