బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు : బండి సంజయ్ 

బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు : బండి సంజయ్ 

కరీంనగర్ : భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఒక వైరస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక వ్యాక్సిన్ అని, వైరస్ కావాలో..వ్యాక్సిన్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనను ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైనా బండి సంజయ్  స్పందించారు. కరీంనగర్ బీజేపీ ఎంపీగా తాను ఏం చేయాలో అన్ని చేస్తున్నానని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముప్పు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తాము కూడా ఫ్లెక్సీలు పెట్టడం మొదలుపెడితే టీఆర్ఎస్ వాళ్లు ముఖాలు ఎత్తుకోలేరని మండిపడ్డారు. గంగాధర మండలం తుర్కాసిపల్లి శిబిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం మారాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో హడావుడిగా ఎందుకు స్టేట్ మెంట్ ఇప్పించారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసుల వ్యవహారాన్ని విడిచిపెట్టమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరు చేసిన తప్పుల చిట్టాను తన వద్ద పెట్టుకొని, వారిని సీఎం కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. నయీమ్, డ్రగ్స్ కేసులపై గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని అన్నారు.