వెంటాడుతాం, వేటాడుతామనే సీఎం రాష్ట్రానికి వద్దు

వెంటాడుతాం, వేటాడుతామనే సీఎం రాష్ట్రానికి వద్దు

సీఎం కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు భయపడబోమన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్  హుందా తనాన్ని తగ్గించుకోవద్దని..సీఎం పదవికి మచ్చ తీసుకురావొద్దన్నారు. కేసీఆర్ కు భయపడే ప్రసక్తే లేదని..ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు.  కల్లాల్లో ఉన్న ధాన్యం కొంటరా? కొనరా ? అని అడిగామన్నారు. ధాన్యం కొనడానికి కేసీఆర్ కు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు.  కేసీఆర్ స్పందించకపోవడంతోనే  తాము రైతుల దగ్గరకు వెళ్లామన్నారు. తాము రైతులతో మాట్లాడుతుండగానే రైతులపై టీఆర్ఎస్ నేతలు రాళ్లు,కోడిగుడ్లు వేశారన్నారు. రైతుల చేతిలో రాళ్లు,కోడిగుడ్లు ఉంటాయా అని ప్రశ్నించారు. 70 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. తాము రైతుల దగ్గరకు వెళుతున్నామని తెలిసి కొనుగోళ్లు ప్రారంభించారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు.కొనుగోళ్లు సరిగా జరిగితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని  ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తమను వెంటాడుతానంటారా? అని అన్నారు. వేటాడటానికి ,రాళ్లతో కొట్టడానికేనా ముఖ్యమంత్రిని చేసిందన్నారు. ప్రజలను వెంటాడే.. వేటాడే ముఖ్యమంత్రి తమకు అవసరం లేదన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనేది కేంద్రం లక్ష్యమన్నారు. ప్రత్యామ్న్యాయ పంటలు వేయాలని..పంట మార్పిడికి తాము వ్యతిరేకం కాదన్నారు.ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్ ను.. ధర్నా చౌక్ లో ధర్నా చేసే స్థితికి తీసుకొచ్చామన్నారు. వెంటాడుతాం, వేటాడుతాం అంటూ మాట్లాడే సీఎం రాష్ట్రానికి అవసరం లేదన్నారు. అమరుల ఆశయ సాధనకు పోరాడుతున్న తమను వెంటాడుతావా?వేటాడుతావా? అని ప్రశ్నించారు.