119 చోట్ల పోటీ చేయండి.. డిపాజిట్ రాకుండా చేస్తాం : బండి సంజయ్

119 చోట్ల పోటీ చేయండి.. డిపాజిట్ రాకుండా చేస్తాం : బండి సంజయ్

అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మన్నెగూడలో నిర్వహిస్తున్న బీజేపీ వర్క్ షాప్ లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలోని 119  అసెంబ్లీ  నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎంకు సవాల్ విసిరారు. అలా చేస్తే ఏ ఒక్క చోట కూడా డిపాజిట్ రాకుండా చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో సంబంధం లేదన్నట్లు చిత్రీకరించేందుకే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆ పార్టీతో కలిసి డ్రామా ఆడిందని విమర్శించారు. తెలంగాణలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారుతున్నారన్న బండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు.  అన్ని పార్టీలు కలిసి బీజేపీని ఓడించే కుట్ర చేసినా వెనుకంజ వేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. 

రాజరాజ్యం కోసమే కార్నర్ మీటింగ్స్

రామరాజ్య స్థాపన కోసమే బీజేపీ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తోందని బండి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రధాని మోడీ, అమిత్ షాలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో 11వేల కార్నర్ మీటింగ్స్ తో చరిత్ర సృష్టించబోతున్నామని బండి ప్రకటించారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నేతలకు బీజేపీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. అసలు బీజేపీ గురించి కేటీఆర్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణతో కేసీఆర్కున్న బంధం తెగిపోయిందని బండి సంజయ్ అన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రాకు అప్పగించిన చరిత్ర కేసీఆర్ సొంతమన్న ఆయన.. రాష్ట్రంలో ఎన్నికల హామీలు అమలు చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లే అర్హత కేసీఆర్ కు లేదని అన్నారు.