ఎంఐఎంను బాధపెట్టొద్దనే పాక్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించడం లేదు:బండి సంజయ్

ఎంఐఎంను బాధపెట్టొద్దనే పాక్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించడం లేదు:బండి సంజయ్

దేశంలో కొన్ని చెత్త పార్టీలు, కొందరు చెత్త రాజకీయ నేతలు ఉండటం దౌర్భాగ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీపై పాక్ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఓ వర్గం ఓట్లు పోతాయనే కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ స్పందించకుంటే పాక్కు సహకరిస్తున్నట్లే అని తెలిపారు. ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్..ఆ పార్టీని బాధ పెట్టడం ఇష్టం లేకనే మౌనంగా ఉన్నారని చెప్పారు. దేశంలో బాంబు దాడులు జరిగినా కేసీఆర్కు పట్టదన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో బండి సంజయ్ పాల్గొన్నారు. బషీర్ బాగ్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేడ్కర్‌ విగ్రహం  వరకు ర్యాలీ సాగింది. ఈ  ర్యాలీలో బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధాని మోడీకి పాక్ విదేశాంగ మంత్రి క్షమాపణలు చెప్పాలని, పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లైట్ తీసుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు కామెంట్ చేస్తే స్పందిస్తామా..? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి సమక్షంలో కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, బండి సంజయ్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని ఛాలెంజ్ చేశారు. ఈడీ, సీబీఐలకు తాను భయపడనన్న రోహిత్ రెడ్డి..ఈడీ నోటీసులు చూసి లాయర్లే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. ఈడీ నోటీసుల్లో తన వ్యతిగత బయోడేటా మాత్రమే అడిగారని, తన బయోడేటా పబ్లిక్ డొమైన్ లో దొరుకుంది...దానికి నోటీసులు ఇవ్వాలా..? అని ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు. రేపు ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి సంజయ్ రావాలని రోహిత్ రెడ్డి కోరారు.