వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలపై బండి సంజయ్ ధ్వజం

వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలపై బండి సంజయ్ ధ్వజం

హనుమకొండ, వెలుగు:  వరంగల్ సిటీలో ఈస్ట్, వెస్ట్  ఎమ్మెల్యేలు రాహు,కేతువులుగా మారి జనాలను పీడిస్తున్నారని బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ బండి సంజయ్​ కుమార్​ ధ్వజమెత్తారు. తప్పుడు పత్రాలు సృష్టించి వందల కోట్ల విలువైన భూములు మింగేస్తున్నారని ఆరోపించారు.  వాళ్లు ఏం అక్రమాలు చేసినా ఇంకో మూడు నెలలు మాత్రమేనని, ఆ తరువాత వచ్చేది అక్రమాల అంతు చూసే బీజేపీ ప్రభుత్వమేనన్నారు. 'ప్రజా గోస- బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గ్రేటర్​ 54వ డివిజన్​ పరిధి కేయూ జంక్షన్​ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించిన స్ట్రీట్​ కార్నర్​ మీటింగ్​ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వరదసాయాన్ని అడ్డుకున్నట్టుగా తనపై సీఎం కేసీఆర్​ తప్పుడు ప్రచారం చేశారని, తన సంతకం ఫోర్జరీ చేసి ఎలక్షన్​ కమిషన్​కు లేఖ రాసింది కేసీఆరేనన్నారు. వరంగల్ అభివృద్ధి కోసం కేంద్రం స్మార్ట్​ సిటీ స్కీం కింద పైసలిస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తోందన్నారు.

 కాజీపేటలో పీవోహెచ్​ కు రూ.430 కోట్లు మంజూరు చేస్తే..  ఎకరంన్నర జాగ ఇవ్వకుండా ప్రాజెక్టును అడ్డుకుంటోందన్నారు. ఓరుగల్లుకు కేంద్రం ఇస్తున్న నిధులు, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్​ కు సవాల్ చేశారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్​ ఫక్తు రాజకీయాలు చేస్తున్నారని, మళ్లీ తెలంగాణ సెంటిమెంట్​ రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్​ పార్టీ ఢిల్లీలో లేదు.. గల్లీలో లేదని విమర్శించారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, డబుల్ ఇంజిన్​ సర్కారుతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేసీఆర్​ కొడుకు మంత్రి కేటీఆర్​ సీఎం కావడానికి ఎమ్మెల్యే సాయన్న సంతకం పెట్టలేదని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడం వల్లే సాయన్న అంత్యక్రియలను నిర్లక్ష్యం చేశారని  బండి సంజయ్​ ఆరోపించారు. ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే చనిపోతే పట్టించుకోకుండా నిజాం వారసుడికి మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశాడన్నారు. 

ప్రీతి కేసును తప్పుదోవ పట్టిస్తున్నరు

కాకతీయ మెడికల్​ కాలేజ్​ లో సూసైడ్​ అటెంప్ట్​ చేసిన డాక్టర్​ ప్రీతి కేసును తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని బండి సంజయ్​ ఆరోపించారు. లవ్​ జిహాదీ పేరుతో అమ్మాయిలను ట్రాప్​ చేస్తుంటే.. పోలీసులు ప్రీతి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి లవ్​ జిహాద్​ కాదని చెప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొంతమంది ప్రీతి తండ్రిని మిస్​ గైడ్​ చేశారని, కావాలనే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ ఘటపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి తదితరులున్నారు.

దొరల రాజ్యం నడుస్తోంది..

వర్ధన్నపేట: పేదలు ఓట్లు వేస్తే.. దొరలు రాజ్యం ఏలుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్​కు చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. పేదల సంక్షేమానికి నిధులు ఉండవు కానీ కేసీఆర్ కూతురు లిక్కర్ దందా చేసుకోడానికి మాత్రం డబ్బులుంటాయా? అని ప్రశ్నించారు. అనంతరం డీసీ తండా వాసులతో మాట్లాడారు. తండాలో ఆరు నెలలుగా కరెంట్ లేదని తెలుసుకొని, అందుకు కావాల్సిన రూ.2లక్షలు బండి సంజయ్ ఇచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ కు 50 గ్రామాలకు సరిపడా కరెంట్ పోతుందని, తండాలకు మాత్రం కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ​బీజేపీ జిల్లా అధ్యక్షుడు  కొండేటీ శ్రీధర్, నియోజకవర్గ ఇన్ చార్జి కేశవరెడ్డి, చిట్టూరి అశోక్,చీటూరి రాజు , శ్రీదేవి  తదితరులున్నారు.

వందల ఎకరాలకు రైతుబంధా?

బచ్చన్నపేట: వందల ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు రైతుబంధు ఇవ్వడం ఏంటని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బెల్టు షాపులు పెట్టి, ప్రజలను మద్యానికి బానిస చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, ఉపాధ్యక్షడు బేజాడి బీరప్ప,  నియోజవర్గ కన్వీనర్​బల్ల శ్రీనువాసు, మండలాధ్యక్షుడు సద్ది సోమిరెడ్డి ఉన్నారు.

తొర్రూరు: ప్రధాని మోడీ మచ్చలేని నాయకుడిగా ఎదుగుతున్నారని బీజేపీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్​చార్జ్​ పెదగాని సోమయ్య అన్నారు. శుక్రవారం తొర్రూరు పట్టణంతో పాటు కంఠాయపాలెంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపిస్తే రాష్ట్రంలో సుభిక్ష పాలన వస్తుందన్నారు. పేదల కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు బొమ్మనబోయిన కుమార్, ప్రవీణ్ తదితరులున్నారు.