వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం 

వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం 

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దమ్మాయిగూడ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ తో ఇక్కడి ప్రజల ఆరోగ్యం చెడిపోతోందని, సమస్య పరిష్కారానికి పాదయాత్ర పూర్తైన తర్వాత తానే వచ్చి పోరాడుతానని చెప్పారు. టీఆర్ఎస్ నేతలను పట్టుకొచ్చి డంపింగ్ యార్డు వద్ద కట్టేయాలని, అప్పుడే ఈ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలు పడుతున్న బాధలు వారికి తెలుస్తాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద కొచ్చి.. ఇక్కడి ప్రజల బాధలు తెలుసుకోవాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతోంది. యాప్రాల్ నుండి దమ్మాయిగూడ వరకూ పాదయాత్ర చేశారు. ఆ తర్వాత దమ్మాయిగూడ చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. 

మేడ్చల్ జిల్లాలో భూకబ్జాలు

మేడ్చల్ జిల్లాలోని కొంతమంది నాయకులు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్, రోడ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని టీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, కమీషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చివరకు ‘మిషన్ భగీరథ’ పేరుతో కూడా పైపులు అమ్ముకుంటున్నారని చెప్పారు. మేడ్చల్ ఆర్టీసీ డిపో ఆస్తులను తనఖా పెట్టి కేసీఆర్ అమ్మారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోలను కూడా తనఖా పెట్టి షాపింగ్ మాల్ లను చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశాడని తెలిపారు. బోడుప్పల్ ప్రాంతంలో 7 వేల ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయలేదని, ఈ ప్రాంతంలో 100 పడగల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ కూడా లేదన్నారు.

దళితులకు మూడెకరాలు ఎందుకు ఇవ్వడం లేదు

కేంద్ర నిధులను పక్కదారి పట్టించి.. కమీషన్ల కోసం ట్రాక్టర్లను కొనిపిస్తున్నారని, అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు టీఆర్ఎస్ పార్టీ అని బండి సంజయ్ అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎంతమంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చారని ప్రశ్నించారు. ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇచ్చారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదని, దళితులకు మూడెకరాలు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. 

ఉప ఎన్నిక వల్లే ఎస్టీ రిజర్వేషన్, గిరిజన బంధు అంటున్నారు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఎస్టీలకు సంబంధించిన ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టే.. సీఎం కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్, గిరిజన బంధు అంటున్నారని బండి సంజయ్ అన్నారు.  ఇప్పటి వరకూ పోడు భూముల సమస్యలను పరిష్కరించలేదన్నారు. 8 సంవత్సరాలుగా ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎలక్షన్స్ లో గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును ఓడించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేశారని అన్నారు. 

వెంటిలేటర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం

పోస్టింగుల కోసం కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి భజన పరులుగా మారారని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ ను అభినవ అంబేద్కర్ అంటూ కలెక్టర్  పొగుడుతున్నారంటూ తప్పుపట్టారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని,  ఉఫ్ అంటే ఊడిపోయే ప్రభుత్వమని చెప్పారు. రాష్ట్రంలో నిరుపేదల సమస్యలను గాలికి వదిలేసి, జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ దేశం పట్టుకుని తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లోనూ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుంటే కేసీఆర్ వణికిపోతున్నారంటూ సెటైర్ వేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.