ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు.. కమీషన్ల కోసమే

ప్రైవేట్ వర్సిటీలకు అనుమతులు.. కమీషన్ల కోసమే
  • వర్సిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీలు 
  • 4వేల మందికి అడ్మిషన్లు ఎట్లిచ్చినయ్?: సంజయ్  
  • ఉన్నత విద్యామండలి 
  • ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేస్తే కొడ్తరా? అని ఫైర్

ఎల్బీ నగర్, వెలుగు: 
కేసీఆర్ సర్కార్​డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రైవేట్ వర్సిటీలకు అక్రమంగా అనుమతులు ఇస్తున్నదని ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్, శ్రీనిధి కాలేజీలు  ప్రైవేట్ వర్సిటీ హోదా రాకుండానే 4వేల మందికి అడ్మిషన్లు ఎట్లిచ్చాయని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఏబీవీపీ కార్యకర్తలు ఉన్నత విద్యామండలికి వెళ్తే పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యామండలి ఎదుట ధర్నా టైమ్ లో పోలీసుల దాడిలో గాయపడిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మంగళవారం హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఏబీవీపీ కార్యాలయంలో సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమోషన్లకు అమ్ముడుపోయిన కొందరు పోలీసులు, ఏబీవీపీ నాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రైవేట్ వర్సిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీలు 4వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇచ్చాయి? కౌన్సెలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజినీరింగ్ అడ్మిషన్ల దందా ప్రభుత్వ సహకారంతోనే చేస్తున్నారు. విద్యార్థుల పక్షాన ఉన్నత విద్యామండలి ముందు ధర్నా చేస్తే కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం సరికాదు. ఝూన్సీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం పోలీస్ వ్యవస్థకు సిగ్గుచేటు. ఆమెను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు.. లాఠీలతో చితకబాది, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఝూన్సీ ఆత్మరక్షణ కోసం ఎదిరిస్తే పోలీసులను కొడుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తారా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? లేక రౌడీ రాజ్యమా?’’ అని ప్రశ్నించారు. ఈ ఘటనకు కారకులైన ఏసీపీ సహా పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టాలె  

రైతులకు రూ.పది వేల పరిహారం ఇస్తానన్న సీఎం కేసీఆర్ పత్తా లేకుండా పోయారని సంజయ్ విమర్శించారు. ‘‘జీతాలు రాక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తిప్పలు పడుతున్నారు. పేపర్ల లీకేజీ నిందితులు బెయిల్ తీసుకొని దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇన్ని ఇబ్బందులను పట్టించుకోకుండా కేటీఆర్ మాత్రం లండన్ పోయి ఎంజాయ్ చేస్తున్నారు” అని విమర్శించారు. దళితులను అవమానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘అంబేద్కర్ రాజ్యాంగం పుణ్యమా అని నువ్వు మంత్రి అయినవ్. లేదంటే బిచ్చపు బతుకు అయ్యేది. కేసీఆర్ మెప్పు కోసం దళితులను అవమానిస్తావా? పద్ధతి మార్చుకో” అని శ్రీనివాస్ గౌడ్ ను హెచ్చరించారు. 

అమిత్ షాతో ఈటల భేటీ.. ఇయ్యాల ఢిల్లీకి సంజయ్ 

బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. మరోవైపు బుధవారం ఢిల్లీకి రావాలంటూ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.

ఈటల ఢిల్లీ వెళ్తే తప్పేంటి? 

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఈటల మా పార్టీ నాయకుడు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలిసేందుకు ఢిల్లీకి వెళ్తే తప్పేంటి” అని సంజయ్ అన్నారు. ‘‘రాజేందర్ ఏమైనా కాంగ్రెస్ నాయకులను కలవడానికి ఢిల్లీ వెళ్లారా? లేక ఇతర పార్టీల నాయకులను కలవడానికి వెళ్లారా? మా పార్టీలో జాతీయ నాయకులను ఎవరైనా, ఎప్పుడైనా కలిసే స్వేచ్ఛ ఉంది” అని చెప్పారు.