త్వరలో హైవే 563 పనులు షురూ:  ఎంపీ బండి సంజయ్​

త్వరలో హైవే 563 పనులు షురూ:  ఎంపీ బండి సంజయ్​

కరీంనగర్, వెలుగు: జగిత్యాల–-కరీంనగర్–-వరంగల్ హైవే -563 విస్తరణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీ ఎల్కతుర్తి–- సిద్దిపేట– మెదక్(ఎన్ హెచ్ -765 ) రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో బండి సంజయ్ గురువారం  సాయంత్రం కరీంనగర్ లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ ప్రాంతీయ అధికారి కుష్వాహతో సమావేశమయ్యారు.  ఎన్ హెచ్-563 లో జగిత్యాల నుంచి కరీంనగర్​వరకు మొత్తం 58.86 కి.మీ. మేర విస్తరణ పనులు చేపట్టనున్నామని,  ఇందుకు రూ. 2,151.63 కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెప్పారు.

పనులకు సంబంధించి ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్ వరకు 68 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని, ఇందుకు రూ.2,148.86 కోట్లు అవుతాయని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ ముగిసిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. ప్రధాని మోడీ 12న  రామగుండం నుంచి ఏకకాలంలో ప్రారంభించనున్న జాతీయ రహదారుల విస్తరణ పనుల శంకుస్థాపన ఏర్పాట్ల తీరును బండి సంజయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.