దమ్ముంటే లిక్కర్ స్కాంలో నిజాయితీ నిరూపించుకోవాలి : బండి సంజయ్

దమ్ముంటే లిక్కర్ స్కాంలో నిజాయితీ నిరూపించుకోవాలి : బండి సంజయ్

నిర్మల్ జిల్లా: హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు. సీబీఐ విచారణకు పోతే అరెస్ట్ చేస్తారని కేసీఆర్ బిడ్డకు భయం పట్టుకుందని.. అందుకే విచారణకు వెళ్లకుండా కొత్త డ్రామాలకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘‘కవితను అరెస్టు చేస్తే తెలంగాణ బిడ్డను అరెస్టు చేసినట్టుగా తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. లిక్కర్ దందాలో కేసీఆర్ బిడ్డ జైలుకు వెళ్లడం ఖాయం. దమ్ముంటే.. లిక్కర్ దందాలో విచారణకు హాజరై, తమ నిజాయితీ ఏంటో నిరూపించుకోవాలి’’ అని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.  

‘‘కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే... అదెలా సాధ్యం? 37 మంది ఎమ్మెల్యేలను తీసుకుని ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని కూల్చింది కేసీఆరే’’ అని ఆయన మండిపడ్డారు.  ‘‘ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ...నీ అవినీతి, కబ్జాల చిట్టా మా దగ్గర ఉంది... ఇష్టానుసారంగా మాట్లాడితే అంతు చూస్తాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన అల్లుడి కబ్జాలకు అంతే లేదు. మంత్రి పై విచారణ జరపాల్సిందే’’ అని కామెంట్ చేశారు.  ‘‘చలాన్ల పేరుతో నిర్మల్ పోలీసులు రోజుకు లక్ష రూపాయలు వసూలు చేయాలట. 11 ఏళ్లుగా ఇక్కడి డీఎస్పీ తిష్టవేసి కిందస్థాయి సిబ్బందిపై వేధింపులకు గురిచేస్తున్నడు. నిర్మల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్మల్ సంగతేంటో... నేనే చూస్తా’’ అని పేర్కొన్నారు.