ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం లేదు..

ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం లేదు..

నీళ్లు, నిధులు, నియామకాల పేరుతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగింది. అయినా ఇప్పటివరకు ఉద్యోగాల భర్తీ చేయలేదు. దీంతో యువత ఉద్యోగ వయసు దాటిపోయింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం జవాబిస్తారు..? ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు యువతే ఊపిరి. అలాంటి లక్షలాది యువత ఏడేళ్లుగా ఉద్యోగాలు, ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కేసీఆర్​లో మాత్రం ఏ చలనం లేదు. టీఆర్​ఎస్​ ఏడేళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదు. ఉద్యోగాల కోసం 25 లక్షల మంది యువత టీఎస్ పీఎస్సీలో పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరి పరిస్థితేంటి? రాష్ట్రంలో 2 లక్షల 90 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించింది నిజం కాదా..? తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా గ్రూప్–1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరేం ఉంటుంది. రాష్ట్రం ఏర్పడ్డాక టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని యువతకు ఆశ చూపి ఓట్లు వేయించుకొని మోసం చేశారు. 2018 నుంచి అర్హులైన వారందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి. గ్రాడ్యుయేట్స్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 50 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని జూటా మాటలు చెప్పి యువతను మోసం చేసింది కేసీఆర్ కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే ఎత్తడం లేదు. 25 వేల విద్యుత్ ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మాటిచ్చి నిలబెట్టుకోకపోవడం వారిని మోసం చేసినట్లు కాదా? తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఉన్న 20 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డున పడేసిన చరిత్ర కేసీఆర్​ది. కరోనాతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని 12 వేల మంది విద్యా వలంటీర్లు పస్తులుంటున్నారు. ఇదేనా మీ ఏడేళ్ల పాలనలో సాధించిన తెలంగాణ ప్రగతి..? తెలంగాణ వచ్చాక నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు కేసీఆర్ అనునయులకు, నియామకాలు సీఎం ఫ్యామిలీకి దక్కాయి.. అమర వీరులు ఏ ఆశయాల కోసమైతే ప్రాణ త్యాగాలు చేశారో వారి కలలు సాకారం చేసేందుకు బీజేపీ నిబద్ధత తో కృషి చేస్తోంది. ప్రజలందరికీ తెలంగాణ 7వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాం..
- బండి సంజయ్, బీజేపీ స్టేట్ చీఫ్