సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మల్కాజ్గిరి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పేదలకు ఇళ్లు, పెన్షన్లు, ఉద్యోగాలు ఇవ్వడంలేదని అన్నారు. మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ నేతలు ఖాళీ స్థలాలను కబ్జా పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ప్రజావైద్యం కోసం కేసీఆర్ సర్కారు ఒక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నిర్మించలేదని మండిపడ్డారు.
ఒవైసీకి భయపడుతుండు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా నిజం మాట్లాడలేదని బండి విమర్శించారు. ఒవైసీ, ఎంఐఎం పార్టీ నేతలకు భయపడి ముఖ్యమంత్రి నిజాం గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలయ్యే అనేక పథకాలకు మోడీ ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలంటే కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలని అందుకోసం ప్రజలు ఒక్కసారి పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరారు.
దొంగ జీవోలిస్తే వదలం
ముఖ్యమంత్రి ఇన్నేళ్లుగా గిరిజన రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎందుకు మోసం చేశావో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఎస్టీ రిజర్వేషన్ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. దొంగ జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న కేసీఆర్.. పోడు భూములివ్వకుండా అడ్డుకున్నదెవరో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. గతంలో గిరిజన సమస్యలపై తెగించి కొట్లాడి జైలుపాలైంది బీజేపీ నేతలేనన్న విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీని చూసి వణుకుతుండు
బీజేపీకి వస్తున్న స్పందనను చూసి కేసీఆర్ గజగజ వణికిపోతున్నారన్న బండి సంజయ్.. కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు, ఎంఐఎంలు ఏకమైనా తమ పార్టీని ఏం చేయలేవని ధీమా వ్యక్తంచేశారు. ఆ పార్టీల్లో దేనికి ఓటు వేసినా టీఆర్ఎస్ కు వేసినట్లేనని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తుంటే ముఖ్యమంత్రి వాటిని జేబులో వేసుకుంటున్నారని బండి ఆరోపించారు. ప్రగతి భవన్ కేసీఆర్ బార్ గా మారిందన్న ఆయన.. ముఖ్యమంత్రిని తెలంగాణ పొరిమేర వరకు తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు.
