బండి vs పొన్నం .. పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం

బండి vs పొన్నం .. పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం
  •  భగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. పోలీసులకు ఫిర్యాదులు, సంజయ్ దిష్టిబొమ్మల దహనాలు 
  • యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం
  • ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు.. హుస్నాబాద్​ నియోజకవర్గంలో హైటెన్షన్​  
  • పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్

కరీంనగర్/హుస్నాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన మలి విడత ప్రజాహిత యాత్ర బండి వర్సెస్ పొన్నంగా మారింది. యా త్రలో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ, చిగురుమామిడి మండల కేంద్రాల్లో నిర్వహించిన సభ ల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తల్లిని ఉద్దేశించి బండి సంజయ్ సోమవారం రాత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. సంజయ్ కి పొన్నం కౌంటర్ ఇవ్వడం, జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగడం, సంజయ్ దిష్టిబొమ్మల దహనం, యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో హుస్నాబాద్ నియోజకర్గంలో రోజంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 తొలుత మంగళవారం ఉదయం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు సంజయ్ యాత్రను అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని నిలువరించారు. ఆ తర్వాత యాత్ర హుస్నాబాద్ మండలం రాములపల్లికి చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది.  

సంజయ్ అనుచిత వ్యాఖ్యలు

ప్రజాహిత యాత్ర సందర్భంగా సోమవారం రాత్రి సిద్ధిపేట జిల్లా కోహెడ, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రాల్లో బండి సంజయ్ మాట్లాడుతూ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. ‘‘ఇక్కడి ఎమ్మెల్యే(పొన్నం) అంటడు. మొన్న పంచినవి రాముడి అక్షింతలు కావట. అవి రేషన్ బియ్యమట. గుడికి పోతే అయ్యగారు అక్షింతలు ఇస్తరు. ఇవి రేషన్ బియ్యమా. బాస్మతి బియ్యమా? అని అడుగుతమా.. ఈయన ఏం మాట్లాడుతడో తెల్వదు. రాముడు గాడనే పుట్టిండని గ్యారంటీ ఏమిటని ఆయన అంటే.. మీ అమ్మకు నువ్వు పుట్టినవని గ్యారంటీ ఏంటని నేను అన్నా. హాస్పిటల్ లో తల్లికి ఎవరు పుట్టిండ్లని చెప్పేది నర్సమ్మే. కానీ రాముడికి చరిత్రే ఆధారం. వీళ్లు అనుమానంతోనే పుట్టిండ్లు కాబట్టే దేశాన్ని అధోగతి పాలుజేసిండ్లు”అని సంజయ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. 

బొమ్మనపల్లి, రాములపల్లిలో ఉద్రిక్తత

సోమవారం రాత్రి చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో బస చేసిన సంజయ్ మంగళవారం ఉదయం అక్కడి నుంచే యాత్రను కొనసాగించారు. ముందురోజు రాత్రి సంజయ్ చేసిన కామెంట్స్ అప్ప టికే వైరల్ కావడంతో నియోజకవర్గంలో వివిధ ప్రాం తాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. అప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు, పారా మిల టరీ బలగాలను భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు. బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.  పోలీస్ పహారా మధ్యే సంజయ్ యాత్ర బొమ్మనపల్లి నుంచి హుస్నాబాద్ మండలం రాములపల్లిలోకి ప్రవేశించింది.  

జిల్లావ్యాప్తంగా నిరసనలు 

మంత్రి పొన్నంపై సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. కరీంనగర్ ఇందిరాచౌక్ లో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాకు చేశారు. సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మానకొండూరు, హుజూరాబాద్, జమ్మికుంట, చిగురుమామిడి, సైదాపూర్ లోనూ సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. హు స్నాబాద్​లోని అంబేద్కర్​ చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మకు ఉరివేసి నిరసన తెలిపారు. బీజేపీ ఫ్లెక్సీలను చించివేశారు. కరీంనగర్ సీపీకి, మానకొండూరు, హుజూరాబాద్, జమ్మికుంట పోలీస్ స్టేషన్లలో సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. 

పొన్నం తల్లికి పాదాభివందనం: సంజయ్ 

తాను చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ మంగళవారం వివరణ ఇచ్చుకున్నారు. తాను ఎవరినీ కించపర్చేలా మాట్లాడలేదని చెప్పారు. ‘‘పొన్నం ప్రభాకర్ తల్లికి పాదాభివందనం చేస్తున్నా. అమ్మా.. నేను నిన్ను కించపర్చేలా ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మలాగే మీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి. నేను అనని మాటల్ని మీకు ఆపాదించి అవమానిస్తున్నడు” అని అన్నారు. ఒకవేళ తాను తప్పుగా మాట్లాడినట్టు భావిస్తే లీగల్ గా చర్యలు తీసుకోవచ్చన్నారు. తాను కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని.. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. 
  
ప్రచారం కోసమే సంజయ్ డ్రామాలు: పొన్నం 

బండి సంజయ్ కామెంట్స్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తల్లి మాట ఎత్తడమే ఆయన రాజకీయ సమాధికి కారణమవుతుందని హెచ్చరించారు. ‘‘నిన్న ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను సంజయ్ ని ప్రశ్నించాను. ఎంపీగా కరీంనగర్ ప్రజలకు ఏం చేశావని అడిగాను. శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగడం కాదు. నిజంగా ప్రజలకు ఏంచేశారో చెప్పాలి. రాముడి పుట్టుక, అక్షింతల గురించి నేను అనని మాటలను అన్నట్టుగా చెప్తున్నారు. నా తల్లి, జన్మ గురించి మాట్లాడుతున్నారు. ఇదెంతవరకు సమంజసం? ఎవరి తల్లి అయినా తల్లేనని గుర్తు పెట్టుకోవాలి’’ అని పొన్నం హితవు పలికారు. 

యాత్రను అడ్డుకుంటున్నారంటూ ప్రచారం కోసమే సంజయ్ కొత్త డ్రామాలకు తెరలేపాడని విమర్శించారు.  తనకు రాముడు అంటే ఎంత గౌరవమన్నారు. సీతమ్మ కోసం రాముడు పడిన కష్టం, తండ్రి మాటకు కట్టుబడ్డాడని చెప్పే బీజేపీ వాళ్లు.. తన తల్లి జన్మ గురించి మాట్లాడటం ఏం రాజకీయమని ప్రశ్నించారు. ‘‘యాత్ర చేసుకో ఏమైనా చేసుకో. కానీ నాలుక, వళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు” అని పొన్నం హెచ్చరించారు.