పూలే విగ్రహం పదేండ్ల తర్వాత గుర్తొచ్చిందా?: బండ్ల గణేశ్​ ఫైర్​

పూలే విగ్రహం  పదేండ్ల తర్వాత గుర్తొచ్చిందా?:  బండ్ల గణేశ్​ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ‘‘మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఇప్పుడు గుర్తొచ్చిందా? గత పదేండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారు?”అని కాంగ్రెస్​నేత బండ్ల గణేశ్ ఎమ్మెల్సీ కవితను​ప్రశ్నించారు. కాంగ్రెస్​ప్రభుత్వం, రేవంత్​పై విమర్శలు మాని ముందు మందు​స్కామ్​ నుంచి బయటపడి క్లీన్​చీట్​తెచ్చుకోవాలన్నారు. ఆమె నమ్మే దేవుడు, తల్లిదండ్రుల సాక్షిగా అక్రమంగా సంపాదించలేదని చెప్పగలరా? అని కాంగ్రెస్​ నేత బండ్ల గణేశ్​ ప్రశ్నించారు. ఆమె లిక్కర్​ స్కామ్​ను చూసి.. ఎందుకు కన్నాను అని ఆమె తల్లి ఎంత క్షోభ పడి ఉంటుందోనని ఆయన అన్నారు.

ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడితేగానీ.. మీ నాన్న, మీ అన్న, మీ బావ, మీరు.. ఆ రావు.. ఈ రావు.. ఇంకో రావు పదవుల్లో కూర్చుని దోచుకున్నారు. మీరు పదవులన్నింటినీ అనుభవించి.. అందరినీ శాసించి మంత్రులను డమ్మీలు చేశారు. అప్పటి హోం మంత్రి మహమూద్​ అలీ చెప్తే కనీసం కానిస్టేబుల్​ ట్రాన్స్​ఫర్​ కూడా అయ్యేది కాదు. కానీ, మీరు చెప్తే మాత్రం జరిగిపోయేవి. రాష్ట్రాన్ని మీ కబంద హస్తాల్లో పెట్టుకుని సర్వ నాశనం చేశారు.’’ అని ఫైర్​ అయ్యారు.

‘‘కాంగ్రెస్ నేతలు​నర్సిరెడ్డి, దుద్దిళ్ల శ్రీపాదరావులను నక్సలైట్లు చంపేశారని, వారి వారసులు రాజకీయాల్లోకి రావడం తప్పా? జానా రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇచ్చారు. అది తప్పవుతుందా?’’ అని ప్రశ్నించారు. గద్దర్​ను కేసీఆర్, బీఆర్ఎస్​ నేతలు గేటు బయట నిలబెట్టి బతికుండగానే చంపేశారని ఆయన మండిపడ్డారు. ఆయన చనిపోయినా తరతరాలు గుర్తుంచుకునేలా గద్దర్​ను కాంగ్రెస్​ పార్టీ, రేవంత్​రెడ్డి బతికించారన్నారు. బీసీల కోసం వాళ్ల త్యాగం ఏమీ అవసరం లేదని గణేశ్​పేర్కొన్నారు.