మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ పూర్తి
  • స్పీకర్ ముందు హాజరైన  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి,గూడెం మహిపాల్ రెడ్డి
  • విదేశీ పర్యటనకు వెళ్లిన స్పీకర్
  • తదుపరి విచారణఈ నెల 24కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట హాజరయ్యారు. వీరిపై బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. కాగా, వీరిద్దరి తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ అడ్వకేట్ సోమ భరత్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అడ్వకేట్లు అటెండ్ అయి క్రాస్ ఎగ్జామినేషన్ లో పాల్గొన్నారు.

ఇటీవల రాజేంద్ర నగర్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య విచారణకు అటెండ్ కాగా.. తాజాగా మరో ఇద్దరి విచారణ పూర్తయింది. తదుపరి విచారణను స్పీకర్ ఈ నెల 24కి వాయిదా వేశారు. బార్బాడోస్ లో జరగనున్న స్పీకర్ల సమావేశానికి స్పీకర్ వెళుతున్నందన వాయిదా వేసినట్టు అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.

ఇంకా చాలా మంది సాక్షులను విచారణకు తీసుకురావాలి

ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ తరువాత అడ్వకేట్ సోమ భరత్ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిందని చెప్పారు. ఇప్పటి వరకు చాలా అంశాలు బయటకు వచ్చాయన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎంతో సమావేశమై క్రాస్ ఎగ్జామినేషన్ ను ఎలా ఎదుర్కొవాలో తెలుసుకున్నారని ఆయన ఆరోపించారు. సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల సమావేశం అయిన సీసీ ఫుటేజ్ కావాలని కోరామన్నారు. 

ఇంకా అనేక మంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మేం ఫిరాయించలేదని ఎమ్మెల్యేలు ఇంకా బుకాయిస్తున్నారని.. అబద్ధాన్నే  ఆయుధంగా చేసుకొని మాట్లాడుతున్నారని భరత్ ఆరోపించారు. ఏది అడిగినా నిరాకరించడమే పద్ధతిగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు.