చార్జీలను పెంచినోళ్లే ధర్నాలు చేస్తారా: బండి సంజయ్

చార్జీలను పెంచినోళ్లే ధర్నాలు చేస్తారా: బండి సంజయ్

గ్రామాల్లో డబుల్ బెడ్ రూం లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  ప్రతీ లబ్దిదారుడి నుంచి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రూ. 2 లక్షలు తీసుకుని డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తున్నారని మండిపడ్డారు.  గ్రామాల్లో సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసి..గ్రామాలకు కేంద్ర కేటాయించిన నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు కేంద్రం ఇప్పటి వరకు వెయ్యి కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కేంద్రం విడుదల చేసిన నిధులతోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 

 24 గంటల  విద్యుత్ పై జనం నవ్వుతున్నరు

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామన్న కేసీఆర్ మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్..ఇంత వరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక...ఉచిత విద్యా, వైద్యం అందిస్తామన్నారు. 

తల్లిని చంపి దండేసి పొగుడ్తడు

తెలంగాణ వచ్చాక కొండా లక్ష్మన్ బాపూజీ, జయశంకర్ వంటి పెద్దలను కేసీఆర్ అవమానించారని బండి సంజయ్ మండిపడ్డారు. కన్న తల్లిని చంపి తర్వాత ఫోటోకు దండేసి పొగిడే మనస్తత్వం కేసీఆర్ ది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రామ పంచాయితీ ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటే నిధులు మంజూరు చేస్తానన్న కేసీఆర్..ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ పంచాయితీలకు ఎన్ని నిధులు విడుదల చేశారో  శ్వేత పత్రం విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

కవితమ్మా.... ముందు మీ నాన్నను నిలదీయ్

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. మహిళలకు 33 శాతం అసెంబ్లీ టిక్కెట్లు ఎందుకియ్యలేదో కేసీఆర్ను అడుగాలని కవితకు సూచించారు. అలాగే తొలి కేబినెట్లో ఒక్క మహిళకు కూడా చోటెందుకు ఇవ్వలేదో కేసీఆర్ను చెప్పమని సూచించారు. అలాగే మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే నోరెందుకు విప్పడం లేదో కేసీఆర్ను కవిత ప్రశ్నించాలన్నారు.  మహిళా బిల్లు కాపీలను చించేసిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తున్నాడో నిలదీయాలన్నారు. మహిళా గవర్నర్ను ఎందుకు అవమానిస్తున్నాడో సమాధానం చెప్పమని కేసీఆర్ను అడుగు అని కోరారు. మహిళా బిల్లుపై  ఎమ్మెల్సీ కవిత జంతర్ మంతర్ దగ్గర ధర్నా వార్త చూసి జనం నవ్వుకుంటున్నరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.