
బెంగళూరు ‘సైన్స్ వర్సిటీ’కి టాటా ఐడియా
కుదరదన్న కర్జన్.. వివేకానంద సాయం కోరిన జంషడ్జీ
శిష్యురాలు సిస్టర్ నివేదితకు అప్పగించిన స్వామి
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. దేశంలో నంబర్ వన్ యూనివర్సిటీ. ప్రపంచ టాప్ వర్సిటీల్లో ఒకటి. దేశంలో ప్రారంభమైన తొలి రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇదే. ఇంతటి పేరున్న ఈ విద్యా సంస్థ బ్రిటిషర్ల కాలంలోనే స్టార్టయింది. మరి ఆ వలస పాలకులను ఒప్పించి వర్సిటీని స్టార్ట్ చేసింది ఎవరు? అసలు దేశంలో రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎవరికొచ్చింది? దాన్ని ఎవరు అమలు చేశారు? వెనకుండి ఎవరు నడిపించారు?
1893. వేసవి. ఇద్దరు ఇండియన్లు షిప్‌లో జపాన్ నుంచి కెనడాలోని వాంకోవర్ వెళ్తున్నారు. ఒకరు 30 ఏళ్ల సన్యాసి. మరొకరు సక్సెస్‌ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. దేశంలో తయారీ రంగాన్ని పెంచాలని సన్యాసితో వ్యాపారవేత్త అన్నారు. ఎక్స్‌పోర్ట్ హబ్‌గా ఇక్కడి ఇండస్ట్రీని మార్చాలన్నారు. ఇది ఉద్యోగాలు కల్పిస్తుందని, దేశానికి అవసరమైన వస్తువులనూ ఇక్కడే తయారు చేసుకోవచ్చని వివరించారు. యువతకు సైన్స్, టెక్నాలజీలో ట్రైనింగ్ ఇప్పించాలని కూడా చెప్పారు. ఆయన మాటలకు ఆ సన్యాసి ఇంప్రెస్ అయ్యారు. కానీ బ్రిటిష్ పాలనలో అదంత ఈజీ కాదని ఇద్దరికీ తెలుసు. అప్పటికే వాళ్లు దిగాల్సిన ఊరొచ్చేసింది. ఇద్దరూ ఒకరికొకరు గుడ్ బై చెప్పుకొని వెళ్లిపోయారు. మాట్లాడుకున్నారు గానీ ఇద్దరికీ ఒకరి పేరు మరొకరికి తెలియదు.
ముందుండి నడిపిన సిస్టర్ నివేదిత
ఐదేళ్లు గడిచాయి. సన్యాసి ఇండియాకు తిరిగొచ్చారు. ఐదేళ్లూ తాను తిరిగిన దేశాలు, ప్రాంతాల్లో తన మాటలతో సంచలనం సృష్టించారా సన్యాసి. ఇండియాలో ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. దీన్ని గమనించిన ఆ ఇండస్ట్రియలిస్ట్ సన్యాసికి లేఖ రాశారు. ‘దేశంలో సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవడం మీకు గుర్తుందని అనుకుంటున్నా. ఇండియాలో రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టార్ట్ చేసేందుకు మీలాంటి వారు ముందుకొస్తే బాగుంటుంది. ఇన్‌స్టిట్యూట్ కోసం రూ.30 లక్షలు విరాళం ఇవ్వడానికి నేను సిద్ధం. ఉష్ణ మండల ప్రాంతాల్లో వచ్చే వ్యాధులు, ముఖ్యంగా దేశంలో మరుగున పడిన రసాయనాల వెలికితీతపై రీసెర్చ్ చేస్తే మంచి ఫలితాలుంటాయి’ అన్నారు. ఆ ఆహ్వానాన్ని సన్యాసి సొంతంగా స్వీకరించలేదు గానీ తన శిష్యుల్లో ఒకరికి చెప్పారు. ఆ సన్యాసే స్వామి వివేకానంద. ఆ ఇండస్ట్రియలిస్ట్ జంషడ్జీ టాటా. ఆ శిష్యురాలు సిస్టర్ నివేదిత.
ఇప్పటికే మూడు మూతబడ్డాయన్న జార్జ్
1901లో లండన్‌లో ఉండగా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో పై స్థాయి అధికారి సర్జ్ జార్జ్ బిర్‌వుడ్‌ను సిస్టర్ కలిసింది. జార్జ్ నో చెప్పారు. ప్రెసిడెన్సీలో ఇప్పటికే ఇలాంటి మూడు ఇన్‌స్టిట్యూట్‌లు నడవక మూతబడ్డాయని, ఐడియా వదులుకోవాలన్నారు. ఐనా నివేదిత వెనక్కి తగ్గలేదు. ప్రపంచంలోని చాలా మంది థింకర్లకు లేఖలు రాసింది. అమెరికన్ ఫిలాసఫర్ విలియం జేమ్స్ (హార్వర్డ్) స్పందించారు. ఇండియాలో హయ్యర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలన్న టాటా ఐడియా అద్భుతమన్నారు. కానీ 1902లో వివేకానంద కూడా కన్నుమూశారు. ఆ తర్వాత రెండేళ్లకు టాటా కూడా చనిపోయారు. ఇక రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఐడియా మూలనపడ్డట్టేనని అంతా అనుకున్నారు.
మింటో గ్రీన్ సిగ్నల్
కర్జన్ తర్వాత వైస్రాయ్‌గా వచ్చిన లార్డ్ మింటో 1909లో ఇన్‌స్టిట్యూట్‌కు గ్రీన్ సిగ్నలిచ్చారు. తొలుత టాటా అనుకున్నట్టు బొంబాయ్‌లోనే ఇన్‌స్టిట్యూట్ పెట్టాలనుకున్నారు. కానీ తర్వాత బెంగుళూరుకు మారింది. ఇన్‌స్టిట్యూట్‌కు మైసూర్ సంస్థానాధీశుడు మహారాజ కృష్ణరాజ వడయార్ 370 ఎకరాలిచ్చారు. కృష్ణరాజ తండ్రి చమరాజ వివేకానంద పశ్చిమ దేశాల పర్యటనకు సాయంగా నిలిచారు. ఆ సంస్థే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు.
ఇండియన్లకు టెంపర్‌మెంట్ లేదబ్బా: కర్జన్
వైస్రాయ్‌గా అప్పుడే బాధ్యతలు తీసుకున్న లార్డ్ కర్జన్‌ను టాటా కలిశారు. కానీ ఆ ఐడియా సాధ్యమవదని కర్జన్ కొట్టిపారేశాడు. ఇండియన్లకు రీసర్చ్ చేసే టెంపర్‌మెంట్ (స్వభావం) లేదన్నాడు. రీసర్చ్ ట్రైనింగ్ తీసుకున్నా స్టూడెంట్లకు ఉద్యోగాలొస్తాయో రావో అని డౌట్ కూడా లేవనెత్తారు. కానీ సిస్టర్ నివేదిత పట్టు విడవలేదు. రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ వల్ల లాభాల గురించి ఇంగ్లిష్ పేపర్లలో వార్తలు రాశారు. నివేదిత పట్టుబట్టడంతో ఇన్‌స్టిట్యూట్ సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం రామ్‌సే మెక్‌డొనాల్డ్ నేతృత్వంలో కమిటీ వేసింది. అప్పటికే ఆయనకు ‘జడ వాయువు’లను కనుగొన్నందుకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ ఐడియా ఇండియాలో పని చేయదని మెక్‌డొనాల్డ్ కూడా రిపోర్ట్ ఇచ్చారు. హ్యూమానిటీస్, సైన్స్ రీసర్చ్ ఒకచోట ఇమడవన్నారు.