ఎన్నికల వేళ బంగ్లాలో అల్లర్లు..రెండు స్కూళ్లకు, ట్రైన్‌‌కు నిప్పు

ఎన్నికల వేళ బంగ్లాలో అల్లర్లు..రెండు స్కూళ్లకు, ట్రైన్‌‌కు నిప్పు
  •     శుక్రవారం రాత్రి ఓ ట్రైన్‌‌కు, శనివారం రెండు స్కూళ్లకు నిప్పు
  •     16 గంటల్లో 14కు పైగా దాడులు
  •     ఎన్నికలు బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌‌పీ

ఢాకా : ఎన్నికల వేల బంగ్లాదేశ్‌‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. కొన్ని రోజులుగా గుర్తు తెలియని దుండగులు దహనాలకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి ఓ ట్రైన్‌‌లోని 4 బోగీలను తగులబెట్టగా.. శనివారం రెండు స్కూళ్లకు నిప్పు పెట్టారు. శుక్రవారం నుంచి శనివారం ఉదయం దాకా 16 గంటల వ్యవధిలో 14కు పైగా ఇలాంటి ఘటనలు జరిగాయి. మరోవైపు ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనుండటం, ప్రతిపక్ష బీఎన్‌‌పీ(బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ) పిలుపు మేరకు 48 గంటల స్ట్రైక్‌‌ చేస్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. 

ట్రైన్‌‌కు నిప్పు.. నలుగురు మృతి

బెనాపోల్ ఎక్స్‌‌ప్రెస్‌‌లోని 4 బోగీలకు గోపీబాఘ్ ఏరియాలో దుండగులు శుక్రవారం రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఈ కేసులో ప్రమేయం ఉందంటూ ప్రతిపక్ష బీఎన్‌‌పీకి చెందిన కీలక నేత సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ‘‘బీఎన్‌‌పీ యూత్ వింగ్ జూడో దళ్‌‌కు చెందిన 12 నుంచి 13 మంది గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకున్నారు. కిషోర్‌‌‌‌గంజ్ – నార్సింగిడి, నారాయణ్‌‌గంజ్ – కమలాపూర్‌‌‌‌ రూట్లలో నిప్పు పెట్టాలని, పలు వార్డుల్లోని పోలీంగ్ సెంటర్లపై నాటు బాంబులతో దాడి చేయాలని ప్లాన్ చేశారు” అని ఢాకా పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించాలని బీఎన్‌‌పీ డిమాండ్ చేసింది.

రెండు స్కూళ్లకు నిప్పు

పోలింగ్ సెంటర్లుగా ఎంపిక చేసిన 2 స్కూళ్లకు దుండగులు శనివారం నిప్పు పెట్టారు. ‘‘చిట్టగాంగ్‌‌లోని నిశ్చింత పారా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్​కు, గాజీపూర్‌‌‌‌లో ఈస్ట్ చందన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్​కు నిప్పుపెట్టారు” అని అధికారులు వెల్లడించారు.

ఎన్నికలు ఇయ్యాల్నే

బంగ్లాదేశ్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్‌‌పీ బహిష్కరించిన నేపథ్యంలో నాలుగోసారి కూడా షేక్ హసీనా గెలిచే అవకాశం కనిపిస్తోం ది. దేశంలో 11.96 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, 42 వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని బంగ్లా ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ జరగనుందని తెలిపింది. 300 నియోజకవర్గాల్లో 27 పార్టీలకు చెందిన 1,500 మంది క్యాండిడేట్లు పోటీ చేస్తున్నారు. మరో 436 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నారు. 8వ తేదీ ఫలితాలు వెల్లడికానున్నాయి.