సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు: మూడు రోజులు కస్టమర్లపై ఎఫెక్ట్

సమ్మెలో బ్యాంకు ఉద్యోగులు: మూడు రోజులు కస్టమర్లపై ఎఫెక్ట్

దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు రెండ్రోజుల సమ్మెకు దిగారు. 20 శాతం వేతనాల పెంపు సహా పలు డిమాండ్లపై కేంద్ర కార్మిక శాఖ కమిషనర్‌తో యునైటెడ్ ఫోరం ఫర్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) నేతలు చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలం కావడంతో శుక్ర, శనివారాలు విధులను బహిష్కరించారు బ్యాంకు ఉద్యోగులు. దేశ వ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బ్యాంక్ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లకు అంగీకరించాలంటూ నినాదాలు చేశారు ఉద్యోగులు. అలాగే చెన్నై, పాట్నా, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ బ్యాంకు అధికారులు, ఉద్యోగులు తమ నిరసన తెలిపారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే మళ్లీ మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మె చేస్తామని చెప్పారు యూనియన్‌ నేతలు.

వీకెండ్‌లో సమ్మె ఎఫెక్ట్

బ్యాంకు ఉద్యోగులు వారాంతంలో సమ్మెకు దిగడంతో బ్యాంకులు వరుసగా మూడు రోజులు మూతపడుతున్నాయి. శుక్ర, శనివారాల్లో సమ్మె తర్వాత ఆదివారం సెలవు కావడంతో కస్టమర్లకు ఇబ్బందులు తప్పట్లేదు. నేరుగా బ్యాంకులో లావాదేవీలు జరపాల్సిన వారిపై ఇది ఎఫెక్ట్ చూపనుంది. అలాగే ఏటీఎంలలోనూ మూడ్రోజుల పాటు ఏంత మేర డబ్బులు అందుబాటులో ఉంటాయన్నది అనుమానమే. అయితే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లపై ఎంటువంటి ప్రభావం ఉండబోదని ఉన్నతాధికారులు తెలిపారు.