బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే ఇచ్చిన అప్పులే ఎక్కువ

బ్యాంకుల్లో డిపాజిట్ల కంటే ఇచ్చిన అప్పులే ఎక్కువ

వెలుగు బిజినెస్​ డెస్క్​: బ్యాంకులు సేకరించే డిపాజిట్ల కంటే ఇచ్చే అప్పులు ఎక్కువయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లతో ఇచ్చిన అప్పులు దాదాపు రెట్టింపుగా రికార్డయ్యాయి. బిజినెస్​ సైకిల్​ మెరుగవడమే ఇలా బ్యాంకులు ఇచ్చే అప్పులు పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి బ్యాంకులు ఇచ్చిన అప్పులు 16.5 శాతం పెరిగాయి. మరోవైపు బ్యాంకులలో డిపాజిట్లు మాత్రం 9.2 శాతమే ఎక్కువైనట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) డేటా వెల్లడించింది.

అక్టోబర్​ నెలలో మరింత ఎక్కువ....

అక్టోబర్​ వరకు చూస్తే బ్యాంకులు ఇచ్చిన అప్పుల జోరు మరింత ఎక్కువైంది. ఈ నెలలో క్రెడిట్​ గ్రోత్​ 18 శాతానికి చేరింది. డిపాజిట్లు మాత్రం 9.5 శాతమే పెరిగాయి. దీంతో బ్యాంకులు తమ క్రెడిట్​టు డిపాజిట్​ రేషియోను 80 శాతానికి పెంచుకుంటున్నాయి. క్రెడిట్​ గ్రోత్​ ఇదే లెవెల్​లో ఎంతకాలం కొనసాగుతుందనేది కచ్చితంగా తెలీకపోవడంతో బ్యాంకులు డిపాజిట్ల సమీకరణపై అంతగా ఆలోచించడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ కారణంగానే వడ్డీ రేట్ల పెంపుదల ఆఫర్లను  లిమిటెడ్​గానే ప్రకటిస్తున్నాయని పేర్కొంటున్నారు. 

ఎస్​బీఐ క్రెడిట్​ గ్రోత్​ 20 శాతం..

దేశంలోనే అతి పెద్ద బ్యాంకయిన స్టేట్​ బ్యాంక్​ ఆఫ్ ఇండియా క్రెడిట్​ గ్రోత్​ సెప్టెంబర్​ చివరినాటికి 20 శాతానికి చేరింది. ఏడాది మొదట్లో క్రెడిట్​ గ్రోత్​ 12 శాతం దాకా ఉండొచ్చని ఎస్​బీఐ అంచనా వేసింది. డిపాజిట్లతో పోలిస్తే క్రెడిట్​ గ్రోత్​ రెట్టింపు వేగం చూపిస్తున్నప్పటికీ, తగినన్ని డిపాజిట్లు తమ వద్ద ఉన్నాయని ఎస్​బీఐ ఛైర్మన్​ దినేష్​ ఖారా ఇటీవల చెప్పారు. బిజినెస్​ సీజన్ ​బిజీ కావడం వల్లే క్రెడిట్​ జోరందుకుందని ఖారా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి క్రెడిట్​ గ్రోత్​ 14–16 శాతం దాకా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, రెన్యువబుల్​ ఎనర్జీ, ఆయిల్​ మార్కెటింగ్​ కంపెనీలు, సర్వీస్​ సెక్టార్లోని కంపెనీలు ఎక్కువగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నట్లు ఖారా వివరించారు.

ఆ కంపెనీలు తయారు చేసే వస్తువులు, సేవలకు డిమాండ్​ పెరుగుతుంటే బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులూ ఆ మేర పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు డిపాజిట్లు వేగంగా పెరగకపోవడం బ్యాంకులను కొంత కలవరపెడుతోంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లలో స్థిరత్వం రావల్సి ఉందని బ్యాంక్​ ఆఫ్​ బరోడా మేనేజింగ్​ డైరెక్టర్​ సంజీవ్​ చద్దా చెప్పారు. రేట్ల విషయంలో కొంత ఫ్లెక్సిబుల్​గా వ్యవహరించడమే మేలని, రాబోయే నెలల్లో రేట్లు స్థిరపడితే దానికి తగినట్లుగా అడ్జస్ట్​ చేసుకోవడం వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు స్థిరపడేదాకా కొత్త డిపాజిట్లను తెచ్చుకోవడానికి కొంత ఆకర్షణీయమైన ఆఫర్లు  ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ​ క్రెడిట్​ గ్రోత్​ ప్రస్తుతం జోరుగా ఉన్నా, రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని చెప్పలేమని చద్దా పేర్కొన్నారు.