లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజుల పేరిట బ్యాంకుల బాదుడు

లోన్ ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజుల పేరిట బ్యాంకుల బాదుడు
  • ఈ పనులు చేసేదోమో సెర్ప్, మెప్మా సిబ్బంది, వీఓలు
  • వారి కష్టాన్ని తమ ఖాతాల్లో వేసుకుంటున్న బ్యాంకర్లు
  • ఒక్కో లోన్‌‌పై రూ.500 నుంచి రూ.5,000 వరకు కటింగ్

హైదరాబాద్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో డ్వాక్రా గ్రూపులకు లోన్ ప్రాసెసింగ్, రికవరీ తదితర సర్వీసులను సెర్ప్ సిబ్బంది, మహిళా సమాఖ్యలు అందిస్తుంటే.. ఆ పేరుతో సర్వీస్ చార్జీలను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఏటా మహిళా సంఘాలకు రాష్ట్రంలోని వివిధ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. వాస్తవానికి ఇతర లోన్ల విషయంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బందే ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. కానీ బ్యాంకు లింకేజీ రుణాల కేటగిరీలో గ్రూప్ మొబిలైజేషన్, ఎంసీపీ ప్రిపరేషన్, డాక్యుమెంటేషన్, మానిటరింగ్, రికవరీ వంటి సేవలను సెర్ప్, మెప్మా సిబ్బందే నిర్వహిస్తున్నారు. వారికి స్థానిక విలేజీ ఆర్గనైజేషన్స్ (వీఓ) సాయం చేస్తున్నాయి. ఏటా రూ.15 వేల కోట్ల లోన్లు ఇస్తూ, వాటికి మిత్తిని బరాబర్ వసూలు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్న బ్యాంకులు.. సెర్ప్ సిబ్బంది, మహిళా సమాఖ్యలు చేస్తున్న పనికి కనీసం సర్వీస్ చార్జీలు కూడా ఇవ్వట్లేదు. పైగా మహిళా సంఘాల నుంచి ఒక్కో లోన్‌‌పై రూ.500 నుంచి రూ.5000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి.

సర్కార్ ప్రతిపాదనలు గాలికి

మహిళా సంఘాలకు బ్యాంకులు ఇస్తున్న లోన్లలో గ్రామ సమాఖ్యలకు 0.5 శాతం, సెర్ప్ కు 3 శాతం చెల్లించాలని సిఫార్సు చేస్తూ 2013లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిఫార్సులను సరిగ్గా అమలు చేస్తే సెర్ప్ ఖాతాలో- ఏటా రూ.350 కోట్లకు పైనే జమయ్యేవి. కానీ ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వాలుగానీ, బ్యాంకులుగానీ వాటిని పట్టించుకోవడం లేదు. స్వయం సహాయక సంఘాల వద్ద 10 శాతం నుంచి 12 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తూ ఏటా రూ.1,500 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తున్నాయి. మహిళా సంఘాలకు ఎలాంటి సర్వీస్ ఇవ్వకుండానే 2 శాతం సర్వీస్ చార్జీలు వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చేసి పెడుతున్న డాక్యుమెంటేషన్, రికవరీ పనులకు బ్యాంకులు సర్వీస్ చార్జీలు తిరిగి చెల్లిస్తే.. ఆ డబ్బులను వీవోలు (విలేజ్ ఆర్గనైజర్లు), ఎంఎస్ (మండల సమాఖ్య), జెడ్ఎస్ (జిల్లా సమాఖ్య)ల ఖాతాల్లో జమ చేయొచ్చని, వీవోల వేతనాలు చెల్లించవచ్చని, సెర్ప్ ఉద్యోగుల జీతాలు పెంచవచ్చని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో ఇదే విషయాన్ని స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. ఇప్పటికే మెదక్ డీసీసీబీ బ్యాంకు వడ్డీలో ఐదు శాతం ఇచ్చేందుకు ఎంఓయూ కుదుర్చుకుందని చెప్పారు. ఇదే విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలైతే మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని సెర్ప్ డైరెక్టర్ ఒకరు వెల్లడించారు.