అంచనాలను మించిన బ్యాంకుల లాభాలు

అంచనాలను మించిన బ్యాంకుల లాభాలు
  • క్యూ3 లో 60 శాతానికి పైగా ప్రాఫిట్ సాధించిన యాక్సిస్‌‌‌‌, కెనరా, ఐడీబీఐ
  • పెరిగిన వడ్డీ ఆదాయం.. తగ్గిన మొండి బాకీలు
  • బ్యాంకులిచ్చిన అప్పుల్లో వృద్ది

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: దేశంలోని బ్యాంకులకు డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో మంచి లాభాలు వస్తున్నాయి. తాజాగా యాక్సిస్, కెనరా, ఐడీబీఐ బ్యాంకులు తమ రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించగా, ఈ మూడు బ్యాంకుల లాభం 60 శాతానికి పైగా పెరగడం విశేషం. యాక్సిస్ బ్యాంక్  నికర లాభం క్యూ3 లో 62 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 5,853 కోట్లకు ఎగిసింది.  ఈ బ్యాంక్ లాభం రూ.5,500 కోట్ల దగ్గర ఉంటుందని ఎనలిస్టులు అంచనావేశారు. నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ. 11,459 కోట్లకు చేరుకుంది. అప్పులపై వసూలు చేసిన వడ్డీ, డిపాజిట్లపై ఇచ్చిన వడ్డీల తేడాను నికర వడ్డీ ఆదాయం అంటారు. డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ ప్రొవిజన్లు, కాంటింజెన్సీలు ఏడాది ప్రాతిపదికన 8 శాతం పెరిగి రూ.1,438 కోట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఎనలిస్టుల అంచనాలను దాటింది.పెరిగిన రెపో రేటు భారాన్ని లోన్లకు బదిలీ చేయడంలో సక్సెస్ అయిన యాక్సిస్ బ్యాంక్‌‌‌‌, క్యూ3 లో తన మార్జిన్లను మెరుగుపరుచుకోగలిగింది. బ్యాంక్ లోన్ బుక్‌‌‌‌లో 68 శాతం అప్పులు ఫ్లోటింగ్ రేటుకి లింక్ అయి ఉన్నాయి. ఇందులో 22 శాతం అప్పులు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్‌‌‌‌ రేట్ (ఎంసీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) కు, మిగిలినవి ఎక్స్‌‌‌‌టర్నల్‌‌‌‌  బెంచమార్క్‌‌‌‌ రేటుకి లింక్ అయి ఉన్నాయి. రిటైల్‌‌‌‌, స్మాల్ బిజినెస్‌‌‌‌లకు ఇచ్చే లోన్లు పెరగడంతో బ్యాంక్ లోన్‌‌‌‌ బుక్ విలువ ఏడాది ప్రాతిపదికన 15 % పెరిగి రూ.7.62 లక్షల కోట్లకు చేరుకుంది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో మెరుగుపడింది. మొత్తం లోన్లలో గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల వాటా ఏడాది ప్రాతిపదికన 3.17 శాతం నుంచి 2.38 శాతానికి తగ్గింది. వాల్యూ పరంగా చూస్తే యాక్సిస్ బ్యాంక్  గ్రాస్ ఎన్‌‌‌‌పీఏలు రూ.19,961 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ షేరు సోమవారం రూ.930 దగ్గర ఫ్లాట్‌‌‌‌గా ముగిసింది.

ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ లెవెల్లో ప్రాఫిట్‌‌‌‌

ఐడీబీఐ బ్యాంక్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రికార్డ్ లెవెల్లో  ప్రాఫిట్ సాధించింది. బ్యాంక్ నికర లాభం  ఏడాది ప్రాతిపదికన 60 % పెరిగి రూ. 927 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.578 కోట్ల నికర లాభాన్ని  ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం 23 % పెరిగి రూ.2,383 కోట్ల నుంచి రూ.2,925 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ డిపాజిట్లు కూడా క్యూ3 లో  మెరుగుపడ్డాయి. ఏడాది ప్రాతిపదికన 5% పెరిగి రూ. 2.32 లక్షల కోట్లకు ఎగిశాయి. బ్యాంక్ నికర అడ్వాన్స్‌‌‌‌లు 17 % పెరిగి రూ.1.26 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి. ఐడీబీఐ బ్యాంక్  మొండి బాకీలు (ఎన్‌‌‌‌పీఏల) క్యూ3 లో దిగొచ్చాయి. 2021 లోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో  21.68 శాతంగా రికార్డయిన గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో, క్యూ3 లో 13.82 శాతానికి మెరుగుపడింది. నికర ఎన్‌‌‌‌పీఏలు 1.81 శాతం నుంచి 1.07 శాతానికి తగ్గింది.

అదరగొట్టిన కెనరా బ్యాంక్‌‌‌‌

కెనరా బ్యాంక్ నికర లాభం డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ3)లో 92 శాతం పెరగడం విశేషం. 2021 లోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ. 1,502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించిన ఈ బ్యాంక్‌‌‌‌,  తాజాగా ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.2,882 కోట్లు సాధించింది. వడ్డీ ఆదాయంపెరగడంతో పాటు  మొండి బాకీలు తగ్గడం వలన కెనరా బ్యాంక్ లాభం భారీగా పెరిగింది. బ్యాంక్ మొత్తం ఆదాయం  ఏడాది ప్రాతిపదికన రూ.21, 312 కోట్ల నుంచి రూ. 26,218 కోట్లకు ఎగిసింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ. 22,231 కోట్లుగా ఉంది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్యూ3 లో మెరుగుపడింది. అడ్వాన్సుల్లో గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 7.80 శాతం నుంచి 5.89 శాతానికి తగ్గింది. నెట్ ఎన్‌‌‌‌పీఏ రేషియో 2.86 శాతం నుంచి 1.96 శాతానికి మెరుగుపడింది. కెనరా బ్యాంక్ షేరు సోమవారం 1.27 శాతం లాభపడి రూ.323 వద్ద క్లోజయ్యింది.